శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Feb 13, 2020 , 23:08:18

తెలంగాణ యాసలో మాట్లాడుతా!

తెలంగాణ యాసలో మాట్లాడుతా!

‘ప్రెజర్‌ కుక్కర్‌' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది గుజరాతీ సుందరి ప్రీతీ అస్రాని. సాయిరోనక్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుజోయ్‌, సుశీల్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 21న అభిషేక్‌ పిక్చర్స్‌ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రీతీ అస్రాని మాట్లాడుతూ ‘మా స్వరాష్ట్రం గుజరాత్‌లో పాఠశాల విద్య పూర్తి చేయగానే కొన్ని లఘు చిత్రాల్లో నటించాను. రానా దగ్గుపాటి సోషల్‌ వెబ్‌ సిరీస్‌ చేశాను. ‘మళ్లీరావా’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించాను. ‘ప్రెజర్‌ కుక్కర్‌' కథానాయికగా తొలిచిత్రం. ఈ టైటిల్‌ విన్నప్పుడు ఆశ్చర్యంగా, గమ్మత్తుగా అనిపించింది.


అందుకే ఈ టైటిల్‌..

బీటెక్‌ పూర్తయిన ఓ యువకుడిని అమెరికా వెళ్లి సెటిల్‌ కావాలని  అతని తల్లిదండ్రులు, సన్నిహితులు ఒత్తిడి తెస్తుంటారు. దీంతో అతను ప్రెజర్‌ కుక్కర్‌లో ఉన్న భావనకు లోనవుతుంటాడు. ఆ కారణంగానే సినిమాకు ఆ టైటిల్‌ పెట్టాం. ఇందులో నేను అనిత అనే సామాజిక కార్యకర్తగా కనిపిస్తాను. నవతరం అమ్మాయికి ప్రతీకలా ఉంటాను. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, సెంటిమెంట్‌, సందేశం కలబోసిన సినిమా ఇది.  ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను. నేనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పాను. ప్రస్తుతం గోపీచంద్‌ నటిస్తున్న ‘సీటీమార్‌' చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నా.