బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 13:23:13

జోంబీ రెడ్డి టైటిల్‌ వివాదంపై ద‌ర్శ‌కుడు వివ‌ర‌ణ‌..!

జోంబీ రెడ్డి టైటిల్‌ వివాదంపై  ద‌ర్శ‌కుడు వివ‌ర‌ణ‌..!

అ! సినిమాతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఆ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌తో క‌ల్కి అనే సినిమా తీసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అత‌ని ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇప్పుడు త‌న మూడో సినిమాగా క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో  ''జోంబీ రెడ్డిస‌స అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో రూపొందుతున్న ఫస్ట్ జోంబీ సినిమా అని చెప్తూ తనదైన స్టైల్ తో ప్రశాంత్ ఆ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్‌లో ఓ సామాజిక వర్గానికి చెందిన పేరుని టైటిల్ లో వాడటంపై ర‌చ్చ మొద‌లైంది. వైర‌స్‌కి క్యాస్ట్‌కి సంబంధం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. దీనిపై తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు ప్ర‌శాంత్ వ‌ర్మ.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ''ఇటీవల నా థర్డ్ ఫిలిం టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా కాల్స్ మెసేజ్స్ వచ్చాయి. సినిమాకు అది యాప్ట్ టైటిల్. యానిమేషన్ కి మంచి పేరొచ్చింది. మూడు నెలలకు పైగా టీమ్ పడిన కష్టానికి వచ్చిన రిజల్ట్ తో మేమంతా హ్యాపీగా ఉన్నాం. అయితే కొంతమంది మాత్రం టైటిల్ ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు'' అని చెప్పుకొచ్చారు.

''సినిమాలో ఎవరినీ తక్కువ చేసి చూపించడం.. ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని తక్కువ చేసి చూపించడం ఉండదు. ఇదొక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ప్రస్తుతం మనం చూస్తున్న కరోనా పరిస్థితుల చుట్టూ జరిగే కథ. నా ప్రీవియస్ ఫిలిం ఎలాగైతే తెలంగాణాలో సెటప్ అయిందో ఈ మూవీ రాయలసీమలోని కర్నూలు ప్లేస్ లో కథ జరుగుతుంది. హాలీవుడ్ లో ఈ టైపు ఎపిడెమిక్ ఫిలిమ్స్ చూస్తుంటాం. అక్కడ న్యూయార్క్ లాంటి సిటీస్ లో ఆ కథ జరిగినట్లు చూపిస్తుంటారు. నేను ఇక్కడ కర్నూలును నేపథ్యాన్ని ఎంచుకున్నాను'' అని ప్రశాంత్ పేర్కొన్నాడు. ''కర్నూలులో ఇలాంటి ఎపిడెమిక్ జరిగితే.. అక్కడి ప్రజలు ఎలా ఫైట్ చేసి దానిని ఆపి ప్రపంచాన్నంతా ఎలా కాపాడతారన్నది ఇందులోని మెయిన్ ఐడియా. సినిమా చూస్తే కర్నూలును కథ ఎంత హైలైట్ చేస్తుందో తెలుస్తుంది. దయచేసి ఈ టైటిల్ ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏ కమ్యూనిటీని తక్కువ చేసి చూపించడం అనేది కచ్చితంగా ఈ సినిమాలో ఉండదు. సినిమా చూసిన తర్వాత మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నా ఫస్ట్ సినిమాకి నేషనల్ వైడ్ గుర్తింపు ఎలా వచ్చిందో.. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను. అప్పుడు మీరందరూ గర్వంగా ఫీల్ అవుతారు. నన్ను నమ్మండి" అని ప్రశాంత్ వర్మ తెలిపారు.

తాజావార్తలు


logo