బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Apr 25, 2020 , 00:04:47

ఆటోలపై పోస్టర్స్‌ అతికించాడు

ఆటోలపై పోస్టర్స్‌ అతికించాడు

హిందీ చిత్రసీమలో ఆమిర్‌ఖాన్‌ను మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా అభివర్ణిస్తారు. వినూత్న కథాంశాల్ని ఎంచుకొని ప్రయోగాలు చేయడంలో, పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో సమకాలీన సినీరంగంలో ఆయనకు సాటెవరూలేరని చెబుతారు. సినిమాను ప్రాణంగా ప్రేమిస్తారాయన. ముఫ్పైరెండేళ్ల క్రితం విడుదలైన ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌' సినిమా ప్రచారంలో భాగంగా ముంబయిలో ఆటోలకు పోస్టర్స్‌ కూడా అతికించాడట ఆమిర్‌ఖాన్‌. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమిర్‌ఖాన్‌ అభిమాని ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అది వైరల్‌గా మారింది. ఇందులో యుక్త వయస్సులో ఉన్న ఆమిర్‌ఖాన్‌ ముంబయి రోడ్డుమీద ఓ ఆటో వెనక భాగంలో ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌' సినిమా పోస్టర్‌ను అతికిస్తూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన ఆమిర్‌ఖాన్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. అంకితభావం, సినిమాపట్ల పాషన్‌కు నిదర్శనమిదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి కాబట్టే సినీరంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించారని కొనియాడుతున్నారు. 1988లో విడుదలైన ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌' రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా విశేష ప్రజాదరణను సొంతం చేసుకొని భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారానే ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా పరిచయమయ్యారు.


logo