శనివారం 28 నవంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 00:17:11

ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా

ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా

మంగళూరు చిన్నది పూజాహెగ్డే తెలుగు చిత్రసీమలో తిరుగులేని స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తోంది. భారీ చిత్రాల్లో నాయికగా అవకాశాల్ని సొంతం చేసుకుంటూ అగ్రపథంలో దూసుకుపోతున్నది. ఇప్పటివరకు తెలుగులో చేసిన చిత్రాల్లో ‘అరవింద సమేత వీరరాఘవ’ తనకెంతో ప్రత్యేకమని చెప్పింది పూజాహెగ్డే. నటనలో పరిణతి సాధించడంతో పాటు తొలిసారి తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం మరచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని పేర్కొంది. ఆ సినిమా తాలూకు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది పూజాహెగ్డే.‘ఎన్టీఆర్‌తో కలిసి తొలిసారి నటించడం గొప్ప అనుభూతిని పంచింది. మా ఇద్దరి ఎనర్జీలెవల్స్‌ ఒకటే కావడంతో తెరపై కెమిస్ట్రీ అద్భుతంగా పండిందనే ప్రశంసలొచ్చాయి. అన్నింటికంటే ముఖ్యంగా నటిగా నాలోని కొత్త కోణాల్ని ఈ సినిమా ఆవిష్కరించింది. నటనాపరంగా ‘అరవింద సమేత’ నా కెరీర్‌లోనే ఉత్తమచిత్రమని చెప్పొచ్చు. దర్శకుడు త్రివ్రిక్రమ్‌గారి ద్వారా ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకునే అవకాశం దొరికింది. అందుకే నా కెరీర్‌లో ఆ సినిమాకు ఎప్పుడు ప్రత్యేకస్థానం ఉంటుంది’ అని పూజాహెగ్డే చెప్పింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అరవింద సమేత వీరరాఘవ’ 2018లో ప్రేక్షకులముందుకొచ్చింది.  ప్రస్తుతం పూజాహెగ్డే  తెలుగులో ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌', అఖిల్‌తో కలిసి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్‌లో కూడా రెండు ప్రాజెక్ట్‌లను ఓకే చేసింది.