అగ్ర కథానాయిక పూజాహెగ్డే ‘ఆల్ అబౌట్ లవ్’ పేరుతో ఇటీవలే ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించింది. తనను ఉన్నతస్థానంలో నిలబెట్టిన సమాజానికి సేవ చేసే లక్ష్యంతో ఈ ఫాండేషన్‌కు శ్రీకారం చుట్టానని పూజాహెగ్డే పేర్కొంది. పిల్లలకు వైద్య, ఆర్థికపరమైన సహాయసహకారాలు అందించడమే ‘ఆల్ అబౌట్ లవ్’ ప్రథమకర్తవ్యమని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నాదైన పరిధిలో సమాజానికి చేయబోతున్న చిరుసేవ ఇది. చిత్రసీమలో ఒక విజయవంతమైన నాయికగా సమాజంలో మార్పును కాంక్షిస్తూ, ఆశ్రితుల్ని ఆదుకోవాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నా. ప్రేమతో చేసే ఏ చిన్న సహాయమైనా ప్రపంచాన్ని మార్చివేస్తుందని నేను బలంగా విశ్వసిస్తా’ అని పూజాహెగ్డే చెప్పింది. ఈ ఫౌండేషన్ స్థాపనకు ముందే తన సొంత పట్టణం మంగళూరులో పలు సేవా కార్యక్రమాల్లో భాగమైంది పూజాహెగ్డే. క్యాన్సర్‌తో బాధపడుతున్న కొందరు చిన్నారుల వైద్య ఖర్చులను భరించడంతో పాటు వందమంది దినసరి కూలీలకు నెలకు సరిపోయే నిత్యావసర వస్తువుల్ని అందించింది. కోమాలోకి వెళ్లిపోయిన ఓ వ్యక్తి కుటుంబ ఆర్థిక అవసరాల్ని తీర్చే బాధ్యతను కూడా పూజాహెగ్డే తీసుకుంది. వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ విరామ సమయాల్ని ఫౌండేషన్ కార్యకలాపాల కోసం వెచ్చిస్తానని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో పూజాహెగ్డే ‘రాధేశ్యామ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తోంది.