బుధవారం 03 జూన్ 2020
Cinema - May 16, 2020 , 22:50:12

అమ్మమ్మ వాళ్లఇంటికెళ్తా!

అమ్మమ్మ వాళ్లఇంటికెళ్తా!

నిత్యం షూటింగ్‌లు, అభిమాన సందోహం మధ్య బిజీగా ఉండే సినీ తారలు లాక్‌డౌన్‌ వల్ల ఇళ్లకే పరిమితమైపోయారు. సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. మంగళూరు సుందరి పూజాహెగ్డే ఈ విరామ సమయాన్ని ముంబయిలో కుటుంబ సభ్యులతో గడుపుతోంది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని చెప్పిందీ సొగసరి. ఓ ఆంగ్ల మాసపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజాహెగ్డే ఆ వివరాల్ని పంచుకుంది.

ఈ విరామాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?

కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉన్నా. నాకు  జిహ్వాచాపల్యం ఎక్కువ. ఈ లాక్‌డౌన్‌ టైంలో పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. అయితే ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్‌ కాలేదు. ఇంట్లోనే వ్యాయామాలు చేస్తున్నా.

లాక్‌డౌన్‌ టైమ్‌లో ఏం మిస్‌ చేసుకున్నారని భావిస్తున్నారు?

నాకు స్నేహితులు ఎక్కువ. కొంతకాలంగా వారిని కలుసుకోలేదు. ముఖ్యంగా రెస్టారెంట్స్‌కు వెళ్లి ఇష్టమైన భోజనాన్ని ఆస్వాదించే వీలులేకుండా పోయింది. అయినా బాధగా లేదు. కరోనాను కట్టడి చేయడం మనందరి బాధ్యత కాబట్టి ఇంటికే పరిమితమైపోయాను.

లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే ఏ ప్రదేశాల్ని సందర్శించబోతున్నారు?

మంగళూరులో ఉండే మా అమ్మమ్మను కలుసుకొని చాలా రోజులైంది. లాక్‌డౌన్‌ తొలగిపోగానే తొలుత అమ్మమ్మవాళ్ల ఇంటికెళ్తా. ఆ తర్వాత నా ప్రియమిత్రుల్ని కలుసుకుంటా. నేను ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యతనిస్తాను కాబట్టి వెంటనే జిమ్‌కు వెళ్లడం మొదలుపెడతా.

భోజనప్రియురాలినని చెప్పారు. ఏ రెస్టారెంట్స్‌కు వెళ్దామనుకుంటున్నారు?

‘ఓ పెడ్రో’ పేరుతో ముంబయిలో మంచి రెస్టారెంట్‌ ఉంది. అక్కడ గోవా-పోర్చుగీస్‌కు సంబంధించిన ఫుడ్‌ బాగుంటుంది. అక్కడ వండే రొయ్యలు బాగా ఇష్టం. బైరూట్‌ అనే మరో రెస్టారెంట్‌ మీట్‌ ప్లాటర్స్‌కు చాలా ఫేమస్‌. అక్కడ నాకు ఇష్టమైన నాన్‌వెజ్‌ను ఆరగించాలని ఉంది.

మొదట ఏ నగరానికి వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నారు?

ఫస్ట్‌ హైదరాబాద్‌కే వెళ్లాలని ఫిక్సైపోయా. ప్రభాస్‌తో చేస్తున్న  సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా మధ్యలో ఆపేశారు. వెంటనే వెళ్లి ఆ షూటింగ్‌లో జాయిన్‌ అవుతా.  కాస్త విరామం తీసుకొని నాకు ఇష్టమైన కేరళలోని పర్యాటక ప్రాంతం బేకల్‌కు వెళ్తా. గత ఏడాది అక్కడికు వెళ్లినప్పుడు ప్రకృతి సౌందర్యం నన్ను ముగ్ధురాలిని చేసింది. మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. మళ్లీ నాటి అనుభూతుల్ని తిరిగి పొందాలనుకుంటున్నా. అన్నింటికంటే ముఖ్యంగా ముంబయిలో ఉంటున్న కొందరు బెస్ట్‌ఫ్రెండ్స్‌ను కలుసుకొని ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలని ఉంది.

ఈ లాక్‌డౌన్‌ వల్ల షాపింగ్‌పరంగాఏమైనా మిస్సయ్యాయనే బాధ ఉందా?

నేను ఆన్‌లైన్‌లో  షాపింగ్‌ ఎక్కువగా చేస్తా. ఇప్పుడు డెలివరీ సైట్స్‌ అన్నీ తమ సేవల్ని  నిలిపివేయడంతో షాపింగ్‌ మిస్సయ్యాను. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌ విరామంలో వివిధరకాల వంటల్ని ట్రై చేశాను. కొన్ని ఫుడ్‌ ఐటెమ్స్‌ తయారీలో ప్రత్యేకమైన దినుసుల్ని వాడతారు. అవి ఓపెన్‌ మార్కెట్‌లో దొరికేవి కావు. ఆన్‌లైన్‌ సర్వీస్‌లు ఓపెన్‌ అయితే కుకింగ్‌ మెటిరీయల్‌ ఆర్డర్‌ చేస్తాను.


logo