గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 23:39:44

మూడు పదుల ప్రేరణ

మూడు పదుల ప్రేరణ

మంగళూరు సోయగం పూజాహెగ్డే ముప్పయ్యవ వసంతంలోకి అడుగుపెట్టింది. చిత్రసీమలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే దక్షిణాది యువతరం హృదయాల్ని కొల్లగొట్టిందీ కన్నడ కస్తూరి. ముఖ్యంగా తెలుగునాట ఈ పొడుగుకాళ్ల వయ్యారికి తిరుగులేని అభిమానగణం ఉంది. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌', అఖిల్‌తో జతగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రాల్లో నటిస్తోంది. మంగళవారం ఆమె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రెండు సినిమాల్లోని ఫస్ట్‌లుక్స్‌ను విడుదల చేశారు. ‘రాధేశ్యామ్‌' చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో వింటేజ్‌ ప్రేమకథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. యూరప్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా లుక్‌లో పూజాహెగ్డే రైలులో ప్రయాణిస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. ఆమెకు అభిముఖంగా ప్రభాస్‌ ఉన్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే పాత్ర పేరు ప్రేరణ అని చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఇటలీలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. లాక్‌డౌన్‌ విరామం తర్వాత ఇటీవలే తాజా షెడ్యూల్‌ను ప్రారంభించారు. షూటింగ్‌ దాదాపు తుదిదశకు వచ్చిందని సమాచారం.


logo