ఆదివారం 05 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 00:04:55

పెళ్లి పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేశారు

పెళ్లి పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేశారు

దక్షిణాది కథానాయిక పూర్ణకు (‘అవును’ ఫేమ్‌) ఓ బ్లాక్‌మెయిలింగ్‌ ముఠా నుంచి చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ ఆమెను లక్ష్యంగా చేసుకొని వేసిన ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం పూర్ణ లాక్‌డౌన్‌ సమయాన్ని తన సొంత పట్టణం కేరళలోని కొచ్చిలో గడుపుతోంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు అన్వర్‌ అలీ అనే పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి.. తాను దుబాయ్‌లో పెద్ద బిజినెస్‌మెన్‌ అంటూ పరిచయం చేసుకున్నాడు. వారం పాటు ఇద్దరి మధ్య సంభాషణలు నడిచాయి. అనంతరం కుటుంబ పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్‌ చేశాడు. తన ఫ్యామిలీ మెంబర్స్‌ కొచ్చికి వచ్చి పెళ్లికి సంబంధించిన విషయాల్ని చర్చిస్తారని నమ్మబలికాడు. అదే రోజు ఓ ఆరుగురు ఆగంతకులు పూర్ణ ఇంటికి వచ్చి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. తాము దుబాయ్‌కు చెందిన బిజినెస్‌మెన్‌ మనుషులమని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని, సినీ కెరీర్‌ను నాశనం చేస్తామని హెచ్చరించారు. దీంతో పూర్ణ కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బ్లాక్‌మెయిలింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేశారు. కొచ్చికి చెందిన అనేకమంది యువతులు, మోడల్స్‌ను ఈ ముఠా ఇదే తరహాలో మోసం చేసిందని పోలీసుల విచారణలో తెలిసింది.logo