మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 00:23:52

పాయల్‌ కల నిజమైన వేళ

పాయల్‌ కల నిజమైన వేళ

ఏ భాషా చిత్రసీమలోనైనా మెజారిటీ కథానాయికలు డబ్బింగ్‌ కోసం అరువు గొంతుపైనే ఆధారపడుతుంటారు. అయితే గత కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమలో ట్రెండ్‌ మారుతోంది. యువ కథానాయికలు తెలుగు నేర్చుకొని సొంత గొంతుకను వినిపించాలని తపిస్తున్నారు. కొన్ని సినిమాల అనుభవంతోనే తెలుగు భాషపై మంచి పట్టు సాధిస్తున్నారు. గతంలో నిత్యామీనన్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, తమన్నా వంటి తెలుగేతర నాయికలు చక్కటి తెలుగుతో డబ్బింగ్‌ చెప్పి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇప్పుడు ఈ వరుసలో పంజాబీ భామ పాయల్‌రాజ్‌పుత్‌ చేరింది. ఓ తెలుగు సినిమాకు ఈ సుందరి స్వీయగళాన్ని వినిపించింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘కొనేళ్లుగా కంటున్న నా కల నిజమైంది. తెలుగులో తొలిసారి డబ్బింగ్‌ చెప్పడం గొప్ప అనుభూతిని మిగిల్చింది’ అని వ్యాఖ్యానించింది. అయితే  డబ్బింగ్‌ చెప్పిన సినిమా తాలూకు వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. లాక్‌డౌన్‌ కారణంగా నాలుగు మాసాలు ఢిల్లీలో కుటుంబ సభ్యులతో గడిపిన ఈ అమ్మడు ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చింది. షూటింగ్స్‌లో పాల్గొంటు బిజీగా ఉంది. ‘ఆర్‌.ఎక్స్‌.100’ చిత్రంతో యువతరం హృదయాల్ని కొల్లగొట్టిన ఈ సొగసరి వెంకీమామ, డిస్కోరాజా చిత్రాలతో అగ్రనాయికల సరసన చేరింది. ప్రస్తుతం తెలుగు, తమిళ పరిశ్రమల్లో సినిమాలు చేస్తోంది.


logo