సోమవారం 25 మే 2020
Cinema - Mar 06, 2020 , 18:31:18

‘పలాస 1978’ రివ్యూ..

‘పలాస 1978’  రివ్యూ..


తారాగణం: 

రక్షిత్‌, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్‌, జనార్థర్‌, శృతి, జగదీష్‌ తదితరులు..

సినిమాటోగ్రఫీ: అరుల్‌ విన్సెంట్‌

సంగీతం:  రఘు కుంచె

నిర్మాత: ధ్యాన్‌ అట్లూరి

సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ

రచన-దర్శకత్వం: కరుణకుమార్‌

కొన్ని దశాబ్దాల క్రితం ఓ కాలవ్యవధిలో జరిగే పీరియాడిక్‌ కథలు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉత్సుకతను కలిగిస్తుంటాయి. గతంలోకి ప్రయాణించి అప్పటి కాలమాన పరిస్థితుల్ని తరచి చూడాలని ప్రేక్షకులు ఉబలాటపడతారు. అయితే ఈ కోవలో ఎక్కువగా ఫిక్షన్‌ కథాంశాలే వస్తుంటాయి. యథార్ధ గాథల ఆవిష్కరణ తక్కువగా ఉంటుంది. అందునా సామాజిక అంతరాల్ని చర్చిస్తూ రాజకీయ నేపథ్య చిత్రాలు రావడం చాలా అరుదనే చెప్పాలి. తమిళంలో ఈ తరహా సినిమా రూపకల్పన చాలా ఎక్కువగా ఉంది. అందుకు ఇటీవల విజవంతమైన ‘అసురన్‌' చిత్రమే నిదర్శనం. దర్శకుడు కరుణకుమార్‌ ‘పలాస 1978’ సినిమాతో తెలుగులో ప్రయత్నానికి పూనుకున్నాడు. 1970, 80 దశకాల్లో దేశవ్యాప్తంగా కులవివక్ష, రాజకీయ వర్గపోరాటాలు తీవ్రస్థాయిలో ఉండేవి. నాటి సాంఘిక పరిస్థితులు తదనంతర కాలాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ ఇతివృత్తాన్ని ఎంచుకొని నాటి సామాజిక వివక్ష, రాజకీయ పోరాటాలకు నిమ్నవర్గాలను ఎలా పావులుగా వాడుకున్నారనే సున్నితమైన, ప్రభావశీలమైన అంశాన్ని ‘పలాస 1978’ చిత్రంలో ఓ తాత్విక, సామాజిక కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు..


కథ గురించి...

శ్రీకాకుళం పలాసకు చెందిన జానపద కళాకారులైన అన్నదమ్ములు మోహన్‌రావు (రక్షిత్‌), రంగారావు (తిరువీర్‌) వీధి ప్రదర్శనలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. తండ్రి దృష్టిలో వారిద్దరు రామలక్ష్మణుడు లాంటివారు. మరోవైపు పలాసలో ఇద్దరన్నదమ్ములైన పెద్ద షావుకారు (జనార్ధన్‌), చిన్న షావుకారు గురుమూర్తి (రఘు కుంచె) మధ్య స్థానిక రాజకీయాలు, వ్యాపారం విషయాల్లో ఆధిపత్య పోరు ఉంటుంది. బైరాగి అనే రౌడీ అనుచరుడి అండతో పెద్దషావుకారు అరాచకాలు చేస్తుంటాడు. కొన్ని పరిణామాల నేపథ్యంలో బైరాగిని మోహన్‌రావు, రంగారావు హత్య చేసి జైలుకు వెళతారు. వారిద్దరిని విడిపించుకొని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటాడు చిన్న షావుకారు గురుమూర్తి. ఇద్దరు షావుకార్ల ఆధిపత్య పోరులో అన్నదమ్ములిద్దరూ పావులుగా వాడుకోబడతారు. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? ఎత్తుకుపై ఎత్తులతో సాగే రాజకీయ, సామాజిక చదరంగంలో ఎవరు విజేతలుగా నిలిచారు? ఎవరు పరాజితులుగా మిగిలిపోయారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ..

నాటి కాలం మొదలుకొని నేటి వరకు సమాజంలో రాజకీయ పలుకుబడి ఆశించే ప్రతి ఒక్కరు తమకున్న అర్థబలంతో అంగబలాల్ని సమకూర్చుకోవాలని చూస్తుంటారు. ఇందులో నిమ్నవర్గాలకు చెందిన వారే పావులుగా వాడుకోబడతారు. ‘కత్తి మన దగ్గరే ఉంచుకోవాలి. దాన్ని అవసరమైనప్పుడు వాళ్ల చేతిలో పెట్టాలి. మరోచేతిలో బెల్లం ముక్క ఉంచాలి. ఆ తర్వాత కత్తికి అంటిన రక్తాన్ని మనమే కడిగి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. తిరిగి వాళ్ల చేతికి బెల్లంముక్క ఇచ్చి పంపించాలి’ అంటూ సినిమాలో పెద్దషావుకారు ఓ సందర్భంలో చెబుతాడు. ఈ సంభాషణ ఈ చిత్రకథలో సారాంశాన్ని మొత్తం తెలియజెపుతుంది. 1970, 80దశకం నాటి పలాస ప్రాంతంలోకి సామాజిక అంతరాల్ని ఎత్తిచూపుతూనే నాటి రాజకీయ కక్షల్ని వాస్తవ కోణంలో ఆవిష్కరించింది.


రాజకీయ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసే వర్గాలన్ని నిమ్నవర్గాల్ని తమ ఎదుగుదలకే వాడుకుంటాయి కానీ స్వతహాగా వాళ్లు వృద్ధి చెందడాన్ని ఏమాత్రం సహించలేరు అనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. 70దశకం నాటి పలాస వాస్తవ పరిస్థితులకు యథార్థ దృశ్యరూపంగా ఈ సినిమాను ఆద్యంతం రియలిస్టిక్‌ ఫీల్‌తో తెరకెక్కించారు. అక్కడి ప్రజల వేషభాషల్ని, జానపద కళారూపాల్ని,  యాసను అత్యంత సహజంగా తెరపై తీసుకొచ్చారు. షావుకారు అన్నదమ్ముల రాజకీయ కుట్రలో కళాకారులైన మోహన్‌రావు, రంగారాలు ఎలా పావులుగా మారారు? కళనే నమ్ముకున్న వారు ఆధిపత్య పోరులో రౌడీ అవతారం ఎందుకు ఎత్తారనే అంశాలతో ప్రథమార్థం ఆసక్తికరంగా సాగింది. బైరాగిని అంతమొందించే ఎపిసోడ్‌తో సినిమాలోని ఉద్వేగాలు పతాకస్థాయికి చేరాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ను ఉత్కంఠతో ముగించారు.

ద్వితీయార్థమంతా ఇద్దరన్నదమ్ములు వేసే ఎత్తుకు పై ఎత్తులతో ఆసక్తికరంగా సాగింది. ప్రీైక్లెమాక్స్‌ ఎపిసోడ్‌లో కథలో కీలకమైన మలుపు చోటుచేసుకుంటుంది. ఇక అక్కడి నుంచి పతాకఘట్టాల వరకు సన్నివేశాలన్ని ఉత్కంఠభరితంగా సాగాయి. పలాసకు ఎస్సైగా వచ్చిన సెబాస్టియన్‌ ఎవరి పక్షమో అర్థం కాకుండా అతని పాత్ర చిత్రణలో ఓ రకమైన సస్పెన్స్‌ను కొనసాగించడం ఆకట్టుకుంటుంది. మోహన్‌రావు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తీర్చిదిద్దిర పతాకఘట్టాలు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతను రేకెత్తిస్తాయి. ైక్లెమాక్స్‌కు అర్థవంతమైన ముగింపునివ్వడం మెప్పిస్తుంది. ‘మా కత్తి మీ రక్షణకు కావాలి..మా పాట మీ ఉత్సవాల్లో ఊరేగింపులకు కావాలి. మేము మాత్రం మీ ఇంటిగడప తొక్కకుండా దూరంగానే ఉండాలి’...‘వినాయకుడి తల నరికితే ఆ దేవుడు రక్షించాడు..అదే  ఏకలవ్యుడి వేలు దక్షిణగా ఇస్తే ఏ దేవుడు ఎందుకు రక్షించలేదో ఒక్కసారి అర్థం చేసుకోవాలి’ వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఆద్యంతం సహజంగా సాగిన ఈ సినిమాలో కొన్ని పాటల్ని, నృత్యాల్ని కమర్షియల్‌ సినిమాల పంథాలో చూపించడం మైనస్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ ఘట్టాలు కూడా వాస్తవికతను దూరంగా అనిపిస్తాయి. అయితే ఎక్కడా నేటివిటీ మిస్‌కాకుండా ప్రతి సన్నివేశం నాటి జీవితానికి అద్దం పట్టేలా సాగడం ప్రధానాకర్షణగా నిలుస్తుంది.నటీనటుల అభినయం...

యథార్థ ఘటనల స్ఫూర్తితో రాసుకున్న కథ కాబట్టి అందుకు తగినట్టే తారాగణాన్ని ఎంపిక చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ సహజమైన అభినయాన్ని  కనబరిచారు. మోహన్‌రావు పాత్రలో రక్షిత్‌ అద్భుతంగా ఒదిగిపోయాడు. శ్రీకాకుళం యాసలో అతను పలికించిన సంభాషణలు సహజంగా అనిపించాయి. ఇక తిరువీర్‌ నటన మరింత మెప్పించేలా ఉంది. ఆ పాత్రను అతను పూర్తిగా ఒదిగిపోయాడనిపిస్తుంది. చిన్న షావుకారు గురుమూర్తి పాత్రలో రఘు కుంచె చక్కటి నటనను కనబరిచాడు. ఇతర పాత్రలో జనార్థన్‌, రామరాజు తదితరులు సహజమైన నటనను కనబరిచారు. రఘు కుంచె సంగీతం బాగుంది. ముఖ్యంగా సన్నివేశాల్లోని గాఢతను ఎలివేట్‌ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చక్కగా కుదిరింది. సినిమాటోగ్రాఫర్‌ పనితనం బాగుంది. దర్శకుడు కరుణకుమార్‌ తీవ్రమైన భావోద్వేగాలు, సామాజిక సందేశం మేళవించిన కథను ఆద్యంతం అద్భుతంగా డీల్‌ చేశాడు. కథాగమనంలో ఎక్కడా ఫీల్‌ మిస్‌కాకపోవడం అతని ప్రతిభకు అద్దం పడుతుంది. కథానుగుణంగా నిర్మాణ విలువలు బాగున్నాయి.


తీర్పు:

రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల ఒరవడిలో ‘పలాస 1978’ తెలుగులో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. సమాజ అంతరాల్ని, వాటి వెనకున్న రాజకీయ చదరంగాన్ని ఓ కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది.


రేటింగ్‌: 3/5logo