ఆదివారం 12 జూలై 2020
Cinema - Jun 01, 2020 , 23:56:11

ఓటీటీ ప్రభావం ఉండదు

ఓటీటీ ప్రభావం ఉండదు

‘స్టార్‌ హీరోల సినిమాలతో పోలిస్తే కథను నమ్మి విడుదల చేసిన చిన్న సినిమాలు విజయవంతమైనప్పుడు ఎక్కువ సంతృప్తి లభిస్తుంది’ అని అన్నారు అభిషేక్‌ నామా.  డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాతగా తనదైన అభిరుచితో  చిత్రసీమలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. పంపిణీదారుడిగా వంద చిత్రాల మైలురాయిని పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భం గా సోమవారం అభిషేక్‌ నామా పాత్రికేయులతో ముచ్చటించారు. 

19 ఏళ్ల వయసులో పంపిణీదారుడిగా నా ప్రయాణం ఆరంభమైంది. తొలుత ‘హారీపోటర్‌'  సినిమాను విడుదలచేశాను.  పదహారేళ్ల జర్నీ చాలా సంతృప్తికరంగా సాగింది.  సినిమా తప్ప నాకు మరో ప్రపంచం తెలియదు.   పంపిణీరంగంలో తొందరపాటు పనికిరాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా.  పంపిణీదారుడిగా హాలీవుడ్‌ చిత్రం ‘2012 యుగాంతం’తో పాటు కొత్తదనాన్ని నమ్మి విడుదల చేసిన ‘కుమారి 21ఎఫ్‌' చిత్రాలు  సంతృప్తినిచ్చాయి. వాణిజ్య పరంగా ‘ శ్రీమంతుడు’ ఎక్కువ లాభాల్ని అందించింది.

ఓటీటీ ప్రత్యామ్నాయం కాదు

 థియేటర్లు కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నది అవాస్తవం. కంటెంట్‌ను బట్టే ఏ సినిమాకైనా థియేటర్లు లభిస్తాయి. చిన్న సినిమాను  వందలాది థియేటర్లలో విడుదల చేయడం అసాధ్యం.  థియేటర్ల సమస్య నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు. థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను  ఓటీటీ అందివ్వలేదు.  సినిమా తాలూకు నిజమైన అనుభూతి కేవలం థియేటర్‌లలో మాత్రమే దొరుకుతుంది. శాటిలైట్‌ మార్కెట్‌ మాదిరిగానే ఓటీటీ అనేది నిర్మాతకు అదనపు ఆదాయవనరుగా మారింది. అంతేకానీ ఓటీటీ ప్రభావం థియేటర్లపై పెద్దగా ఉండదు. ఓటీటీకి అలవాటుపడిన వారంతా థియేటర్ల ప్రారంభమైన తర్వాత  సినిమాలు చూడటానికి తప్పకుండా వస్తారు.  

కొత్త ప్రతిభకు ప్రోత్సాహం

నిర్మాతగా, పంపిణీదారుడిగా కొత్త కంటెంట్‌ను ప్రోత్సాహించాలన్నదే నా అభిమతం.  నవ్యమైన ఆలోచనలతో వచ్చే  ఔత్సాహికులకు అండగా ఉంటా. గతంలో రెండు వారాలు టాక్‌ బాగుంటే మూడో వారం నుంచి వసూళ్లు పెరిగేవి. ఇప్పుడా పంథా మారిపోయింది. వారాంతంలోని మూడు రోజులే వసూళ్లు వస్తున్నాయి. సినిమా బాగుంటే ఆ తర్వాత ఆడుతున్నాయి.  ముంబయిలో షూటింగ్‌లకు  అనుమతులిచ్చారు. తెలుగులో ఈ నెలలోనే అనుమతులు లభిస్తాయనే నమ్మకముంది. ఒకవేళ పర్మిషన్‌ వచ్చినా  ఎంత మంది నటీనటులు షూటింగ్స్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారనేది తెలియదు.  సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నా.  కథ సిద్ధమైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తాను. 


logo