గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 23:39:16

భారత తొలి ఆస్కార్‌ విజేత భాను అథయా కన్నుమూత

భారత తొలి ఆస్కార్‌ విజేత భాను అథయా కన్నుమూత

సీనియర్‌ సినీ క్యాస్టూమ్‌ డిజైనర్‌, ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలు భాను అథయా(91) దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో గురువారం ముంబయిలోని స్వగృహంలో కన్నుమూశారు.  మహాత్మాగాంధీ జీవితంతో రిచర్డ్‌ అటెన్‌బరో దర్శకత్వంలో  1983లో రూపొందిన ‘గాంధీ’ చిత్రానికి క్యాస్టూమ్‌ డిజైనర్‌గా జాన్‌ ముల్లోతో కలిసి భాను అథయా ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 1956లో గురుదత్‌ నిర్మించిన ‘సీఐడీ’ చిత్రంతో భాను అథయా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. వందకుపైగా చిత్రాలకు క్యాస్టూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు.  గురుదత్‌, యశ్‌చోప్రా, రాజ్‌కపూర్‌ లాంటి దిగ్గజ దర్శకుల చిత్రాలకు పనిచేశారామే.  లగాన్‌, అగ్నిపథ్‌, లేకిన్‌, చాందిని, రామ్‌ తేరీ గంగా మైలీ, ప్రేమ్‌రోగ్‌, హేరా ఫెరి లాంటి చిత్రాలకు ఆమె ప్రతిభకు తార్కాణాలకు నిలిచాయి. లేకిన్‌, లగాన్‌ చిత్రాలకు క్యాస్టూమ్‌ డిజైనర్‌గా జాతీయ పురస్కారాలను దక్కించుకున్నారు. సినిమాల్ని తెరపై సహజంగా ఆవిష్కరించడంలో క్యాస్టూమ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని,  భారతీయ ఫిలింమేకర్స్‌ ఈ విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ చాలా సందర్భాల్లో భాను అథయా పేర్కొన్నారు.  ఆమె అంత్యక్రియల్ని  దక్షిణముంబయిలోని చందన్‌వాడి శ్మశాన వాటికలో నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.