బుధవారం 03 జూన్ 2020
Cinema - May 18, 2020 , 22:47:42

‘ఆర్‌ఆర్‌ఆర్‌' టీజర్‌ రావడం లేదు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌' టీజర్‌ రావడం లేదు!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). ఈ సినిమాలో రామ్‌చరణ్‌ పాత్ర తాలూకు ఇంట్రడక్షన్‌ టీజర్‌ను ఆయన జన్మదినం సందర్భంగా మార్చిలో విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. ఇదే తరహాలో ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌డేను పురస్కరించుకొని ఆయన పాత్ర తీరుతెన్నుల్ని ఆవిష్కరిస్తూ శక్తివంతమైన టీజర్‌ను విడుదల చేయబోతున్నారని వార్తలొచ్చాయి. ఇందులో ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఎలాంటి టీజర్‌ను విడుదల చేయబోవడం లేదని చిత్ర బృందం సోమవారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. లాక్‌డౌన్‌ పొడిగింపు కారణంగా పనులన్నీ ఆగిపోవడం, సాంకేతిక సమన్వయలోపం వల్ల ఎన్టీఆర్‌ లుక్‌కు సంబంధించిన టీజర్‌ను తీసుకురాలేకపోతున్నామని తెలిపింది. 

ఆలస్యమైనా అద్భుతరీతిలో, అభిమానుల్ని సంతుష్టి పరిచేలా టీజర్‌ను తీర్చిదిద్దుతామని వెల్లడించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌  తన ట్విట్టర్‌ ఖాతాలో అభిమానులకు సందేశాన్నిచారు. ‘ప్రతి ఏడాది నా పుట్టినరోజున మీరు చూపించే ప్రేమను ఓ ఆశీర్వాదంలా భావిస్తా. ఈ సంవత్సరం మాత్రం ఇంటివద్దనే ఉండి భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలి. అదే మీరు నాకిచ్చే విలువైన బహుమతి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి ఎలాంటి ఫస్ట్‌లుక్‌, టీజర్‌ రావడం లేదన్నది మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను. ఒక ప్రచార చిత్రం  రావాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వల్ల అది కుదరలేదు. ఈ చిత్రం ఓ సంచలనం కలిగించి మీ అందరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.


logo