అవసరాల శ్రీనివాస్ నటుడిగాను, దర్శకుడిగాను తెలుగులో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదం అందిస్తున్నాడు. ఆయన హీరోగా 101 జిల్లాల అందగాడు అనే సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిలసౌ. ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది.
నూటొక్క జిల్లాల అందగాడు చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
ఇందులో అవసరాల శ్రీనివాస్ బట్టతలని కవర్ చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆసక్తిగా చూపించారు. బట్టతల వలన తాను కొన్ని సందర్భాలలో ఎమోషన్, ఫ్రస్ట్రేట్ కూడా అయ్యాడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణగా అలరించనున్నారు. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.