మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 21:12:52

నా కెరీర్‌కు విరామం లేదు: త్రిష

నా కెరీర్‌కు విరామం లేదు: త్రిష

ఉద్యోగం పేరుతో సంవత్సరం పొడవున రొటీన్ జీవితాన్ని గడపటమంటే నాకు నచ్చదు. అలాంటి లైఫ్ వద్దనుకొనే సినిమాల్లోకి అడుగుపెట్టాను అని చెబుతోంది త్రిష. కథానాయికగా ఈ సుందరి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో రెండు దశాబ్ధాలు దాటింది. 1999లో జోడీ సినిమాలో హీరోయిన్ స్నేహితురాల్లో ఒకరి పాత్రలో కనిపించిన ఈ అమ్మడు ఆ తరువాత నాయికగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాందించుకుంది. త్రిష సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఇరవై ఏళ్లు దాటినా ఈ సుందరికి ఉన్న క్రేజ్‌లో, గ్లామర్‌లో కొంచెం కూడా మార్పురాలేదు. ఇటీవల విజయసేతుపతితో కలిసి నటించిన 96 తమిళ చిత్రంలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఆమెలో  కెరీర్‌లో తొలినాళ్లలోని ఉత్సాహం అలాగే కనిపిస్తుంది. 

నటనపై నాకున్న ఇష్టమే  తాను ఇన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగడానికి కారణమని చెబుతోంది త్రిష. ఆమె మాట్లాడుతూ చదువంటే ప్రాణమిచ్చే కుటుంబంమాది. మా కుటుంబంలోని వారంతా ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ నాకు మాత్రం తొలి నుంచి రొటీన్‌కు భిన్నమైన జీవితాన్ని గడపటమంటేనే ఇష్టం. నటనలో తప్ప ఇతర వృత్తుల్లో అలాంటి స్వేచ్ఛ ఉండదనే ఉద్ధేశ్యంతోనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. సినిమాలే నా జీవితమనుకొని ఇక్కడ అడుగుపెట్టాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటికి మాత్రం విరామం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ నమ్మకమే నన్ను ముందుకు తీసుకెళుతుంది. విజయాల్ని తెచ్చిపెడుతుంది. జీవితానికి అవసరమయ్యే ఎన్నో విలువైన పాఠాల్ని ఇక్కడే నేర్చుకున్నాను అని తెలిపింది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo