e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home సినిమా నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మొత్తం ఖర్చుచేశా

నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మొత్తం ఖర్చుచేశా

‘గత నెల రోజుల్లో నా దగ్గరకు వచ్చిన సమస్యల్లో చాలా వరకు పరిష్కరించే ప్రయత్నం చేశా. మూడు వందల మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పైగా పరోక్షంగా సాయం చేశాననే సంతృప్తి దక్కింది’ అన్నారు నిఖిల్‌. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలుస్తూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారాయన. నేడు నిఖిల్‌ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మొత్తం ఖర్చుచేశా

గత కొన్ని నెలలుగా ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది. ముఖ్యమైన ఇంజెక్షన్స్‌ దొరకలేని పరిస్థితి తలెత్తింది. హాస్పిటల్‌ బెడ్స్‌, వెంటిలేటర్ల లభ్యత లేకపోవడం వంటి సమస్యలు నా మనసును కదిలించాయి. వాటికి తోడు నా సన్నిహితులు కొందరు కొవిడ్‌తో మరణించడం కలిచివేసింది. ఈ సంఘటనల వల్ల కరోనాతో పోరాడుతున్న వారికి నేను ఏదో ఒక రూపంలో సాయం చేయాలని నిర్ణయించుకున్నా. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులకు ప్రత్యక్షంగా నేను సహాయం చేయడమే కాకుండా పరిచయస్తులు, వాలంటీర్స్‌ ద్వారా వారి సమస్యలు పరిష్కరించాం. ఆక్సిజన్‌ సిలిండర్లు, బెడ్స్‌ ఇప్పించడంతో పాటు ఫార్మా కంపెనీలతో మాట్లాడి అవసరమైన మందులను నా స్వంత డబ్బులతో ప్రజలకు అందజేశా.

డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు..
నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగా చాలా మంది ఫోన్‌లు, వీడియోలు, మెసేజ్‌లు పంపుతున్నారు. వారి అభిమానాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. ఎంతో మంది కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లడం సంతోషంగా అనిపించింది. నా సహాయాన్ని కోరిన వారందరిని సొంత కుటుంబసభ్యులుగానే భావించా. ఈ సేవా కార్యక్రమాల కోసం బ్యాంకులో నేను దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టడం చూసి నా కుటుంబసభ్యులు భయపడ్డారు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్యమనే నా తపనను గ్రహించి వద్దనలేకపోయారు. నేను చేసే ఈ సేవలో నా భార్య పల్లవి భాగస్వామం చాలా ఉంది. స్వతహాగా డాక్టర్‌ కావడంతో అత్యవసర సమయాల్లో తాను నా వెంట వచ్చింది.

వాక్సినేషన్‌ పూర్తయితేనే..
నేను సినిమా నటుడిని కావడం వల్లే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజా సమస్యల్ని తీర్చగలిగా. ఇదివరకు నా అభిమానులతో సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడేవాడిని. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే మంచి పనిలో ఫ్యాన్స్‌ను భాగస్వామ్యం చేశాను. నిర్మాతలు, పంపిణీదారులతో పాటు ఫ్యాన్స్‌ ద్వారా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోగలిగాను. ప్రజలు మళ్లీ థియేటర్‌లకు వచ్చి సినిమాలు చూడాలంటే వ్యాక్సినేషన్‌ పూర్తవ్వాలి. 60 నుంచి 70 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్‌ పూర్తయితేనే కరోనా ప్రభావం తగ్గుతుంది. నా సినిమాలకు పనిచేస్తున్న యూనిట్‌ సభ్యుల్లో నలభై ఐదేళ్లు దాటినవారందరికీ మొదటి డోస్‌ వ్యాక్సిన్స్‌ వేయించాం. సెకండ్‌ డోస్‌ ముగియగానే షూటింగ్‌లు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాం.

ఐదు సినిమాలు చేస్తున్నా…
కొన్నిరోజులుగా కరోనా బారిన పడిన వారికి తోడ్పాటునందిస్త్తూ సినిమాల గురించి ఆలోచించలేదు. నా పుట్టినరోజు సందర్భంగా పోస్టర్స్‌ను విడుదలచేయాలని నిర్మాతలు ఫోన్‌ చేసే వరకు సినిమాల సంగతే గుర్తురాలేదు. ప్రస్తుతం ఐదు సినిమాల్ని అంగీకరించా. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ పతాకాలపై రూపొందుతున్న ‘18 పేజీస్‌’ చిత్రం విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కుతోంది. ‘కార్తికేయ-2’ యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది. తొలిభాగం ముగిసిన చోటు నుంచే ఈ సీక్వెల్‌ మొదలవుతుంది. ఏషియన్‌ ఫిలింస్‌లో ఓ సినిమా చేయాల్సివుంది. సుధీర్‌వర్మ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ప్రసాద్‌ నిర్మాణంలో రూపొందుతున్న సినిమాతో పాటు స్పై థ్రిల్లర్‌ కథాంశంతో మరో చిత్రం చేయబోతున్నా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మొత్తం ఖర్చుచేశా

ట్రెండింగ్‌

Advertisement