న్యూఢిల్లీ: మీరు సొంతిల్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా..?! దేశంలోని అతిపెద్ద బ్యాంకులు ఇంటి రుణాలపై వడ్డీరేటును తగ్గించడం మీరు ఇల్లు కొనుగోలు చేయడానికి మంచి టైం. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), కొటక్ మహీంద్రా బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) తమ ఖాతాదారులకు వడ్డీరేట్లు తగ్గించడంతోపాటు మహిళా కొనుగోలుదారులకు ప్రత్యేక బెనిఫిట్లు కల్పిస్తున్నాయి. నిర్దిష్ఠ గడువులోగా రుణం తీసుకుంటే డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి.
ఖాతాదారుల రుణ పరపతిని నిర్దేశించే సిబిల్ స్కోర్ ఆధారంగా ఎస్బీఐ వడ్డీరేట్లు ఖరారు చేసింది. సిబిల్ స్కోర్ బేష్షుగ్గా ఉండి.. రూ.75 లక్షల రుణం తీసుకునే వారికి 6.70 శాతం వడ్డీరేట్లు వర్తింప జేస్తున్నది. ఇక రూ.75 లక్షలు దాటిన రుణాలపై 6.75 శాతం వడ్డీ అమలు చేస్తున్నది.
అయితే, ప్రజల సొంతింటి కల సాకారం చేయడానికి ఎస్బీఐ తన వంతు సహకారాన్ని అందిస్తున్నది. అందుకే 6.70 శాతం, అంతకుపై వడ్డీరేటు గల రుణాలకు 70 బేసిక్ పాయింట్ల రాయితీ కల్పిస్తున్నది. అయితే ఈ రాయితీ ఈ నెలాఖరు వరకు లభిస్తుంది. అంతేకాదు రుణాల ప్రాసెసింగ్ ఫీజు కూడా వందశాతం మాఫీ చేస్తున్నది ఎస్బీఐ.
ఎస్బీఐ కస్టమర్లు ఆ సంస్థ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే వడ్డీరేట్లో మరో ఐదు బేసిక్ పాయింట్ల రాయితీ లభిస్తున్నది. దీనికి తోడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రుణ గ్రహీతలకు అదనంగా ఐదు బేసిక్ పాయింట్ల మేరకు వడ్డీ రాయితీ కల్పిస్తున్నది.
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ సైతం పరిమిత కాలలో ఇంటి రుణం తీసుకునే ఖాతాదారులకు మార్కెట్లోనే అతి తక్కువ వడ్డీరేటుపై రుణాలిస్తున్నది. ఈ నెలాఖరు వరకు 10 బేసిక్ పాయింట్ల (బీపీఎస్) వడ్డీరేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
దీని ప్రకారం కొటక్ మహీంద్రా బ్యాంకులో ఇంటి రుణం తీసుకునే వారికి స్పెషలాఫర్ కింద రూ.6.65 శాతం వడ్డీపై లోన్ మంజూరవుతుంది. హోంలోన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్లకు 6.65 శాతం వడ్డీరేట్ వర్కవుట్ అవుతుంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ సైతం 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నది.
ఇక హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) తాజాగా బుధవారం ఇంటి రుణం తీసుకునే వారికి వడ్డీరేటులో ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించివేసింది. దీంతో ఇంటి రుణాలపై వడ్డీ 6.75 శాతానికి దిగి వస్తుంది. గురువారం నుంచి హెచ్డీఎఫ్సీలో ఇంటి రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం అమలులోకి వచ్చింది. హౌసింగ్ లోన్లపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయంతో హెచ్డీఎఫ్సీలోని రిటైల్ ఇంటి రుణ ఖాతాదారులందరికి వర్తిస్తుంది.