e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home సినిమా చరిత్ర పుటల్ని తిరగేస్తూ..

చరిత్ర పుటల్ని తిరగేస్తూ..

చరిత్ర పుటల్ని తిరగేస్తూ..

చరిత్ర కాలగర్భంలో కలిసిన రాజులు, రాజ్యాల కథలు ప్రేక్షకుల్లో ఎనలేని ఉత్సుకతను రేకెత్తిస్తుంటాయి. ఈ కథల్లో హీరోయిజం, ప్రేమ, ఉద్వేగాలతో పాటు కావాల్సినంత నాటకీయత ఉంటుంది. అందుకే అలనాటి గాథలపై నేటితరం హీరోలతో పాటు దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. తెలుగు, హిందీతో పాటు వివిధ భాషల్లో చారిత్రక కథాంశాలతో పలు సినిమాలు రూపొందుతున్నాయి. ఆధునిక సాంకేతికతతో నాటి కాలాల్ని పునఃసృష్టిస్తూ ప్రేక్షకులకు సరికొత్త వీక్షణానుభూతినందించేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు.

ఔరంగజేబు కాలంలోకి

చరిత్ర పుటల్ని తిరగేస్తూ..

‘హరిహరవీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల్ని మొఘలుల కాలంలోకి తీసుకెళ్లబోతున్నారు పవన్‌కల్యాణ్‌. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మొఘలుల చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఔరంగజేబు పాత్రను బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ పోషిస్తుండగా ఆయన సోదరిగా జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కనిపించనున్నట్లు సమాచారం. మంచి కోసం పోరాటాన్ని సాగించే ఆ కాలం నాటి బందిపోటుగా పవన్‌కల్యాణ్‌ నటిస్తున్నట్లు సమాచారం. మొఘలుల కాలంతో నేటి ఆధునిక పరిస్థితులను ముడిపెడుతూ వినూత్నంగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు.

చోళ సామ్రాజ్య వైభవం

చరిత్ర పుటల్ని తిరగేస్తూ..

మానస సంబంధాల్లోని సంఘర్షణ, ప్రేమకథల్ని వెండితెరపై హృద్యంగా ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు మణిరత్నం. తన పంథాకు భిన్నంగా తొలిసారి పీరియాడికల్‌ కథాంశంతో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’. చోళ సామ్రాజ్య చక్రవర్తి రాజారాజ చోళుడి జీవితంలోని తొలినాటి సంఘటనల్ని దృశ్యమానం చేస్తూ ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజ్యకాంక్ష, ఆధికారదాహంతో చోళరాజకుటుంబంలో నెలకొన్న ఆధిపత్యపోరు, కుట్రలు కుతంత్రాల్ని చూపిస్తూ రెండు భాగాలుగా మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఐశ్వర్యారాయ్‌, జయంరవి, విక్రమ్‌, కార్తి, త్రిషతో పాటు పలువురు అగ్రనాయకానాయికలు ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.

చరిత్ర పుటల్ని తిరగేస్తూ..

మగధ సామ్రాజ్య చరిత్రలో అత్యంత క్రూరుడైన రాజుగా చరిత్రకెక్కిన బింబిసారుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారు హీరో కల్యాణ్‌రామ్‌. ఆయన కథానాయకుడిగా చారిత్రక అంశాల కలబోతగా రూపొందుతున్న చిత్రం ‘బింబిసార’. వశిష్ఠ్‌ మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో జాలి, దయ లాంటి గుణాలు లేని కఠిన మనస్కుడైన బింబిసారుడు అనే రాజుగా కల్యాణ్‌రామ్‌ కనిపించబోతున్నారు. చెడు స్వభావం నుంచి మంచి వైపు ఆ రాజు సాగించిన ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఆనాటి మగధ సామ్రాజ్య కాలాన్ని పునఃసృష్టించినట్లు తెలిసింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్‌లో చారిత్రక చిత్రాలు

చరిత్ర పుటల్ని తిరగేస్తూ..

అర్ధశాస్త్ర పితామహుడు చాణక్యుడి కథతో అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ సినిమా చేయబోతున్నారు. మౌర్య రాజు చంద్రగుప్తుడి విజయంలో చాణక్యుడి పాత్రతో పాటు రాజనీతి, అర్థిక శాస్ర్తాన్ని గురించి ఆయన వెలువరించిన సిద్ధాంతాల్ని, రచనల ఆధారంగా దర్శకుడు నీరజ్‌పాండే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఢిల్లీని పాలించిన హిందూ చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహన్‌ పాత్రలో బాలీవుడ్‌ అగ్రహీరో అక్షయ్‌కుమార్‌ కనిపించబోతున్నారు. ‘పృథ్వీరాజ్‌’ పేరుతో రానున్న ఈ చారిత్రక చిత్రంలో ముస్లిం దండయాత్రలకు వ్యతిరేకంగా పృథ్వీరాజ్‌చౌహాన్‌ సాగించిన పోరాటంతో పాటు రాణి సంయోగితతో అతడి ప్రేమాయణాన్ని చూపించబోతున్నారు. చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకుడు. కశ్మీర్‌ తొలి మహిళా పాలకురాలిగా చరిత్రను సృష్టించిన రాణి దిద్దా జీవితంతో కంగనా రనౌత్‌ ఓ సినిమా చేస్తోంది. ‘మణికర్ణిక రిటర్న్‌. ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి కంగనా రనౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చరిత్ర పుటల్ని తిరగేస్తూ..

ట్రెండింగ్‌

Advertisement