గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 00:32:21

ఉంగరాలు కొనుక్కోవద్దా?

ఉంగరాలు కొనుక్కోవద్దా?

చూడగానే నాజూకు రూపలావణ్యంతో ఇట్టే ఆకట్టుకుంటుంది డెహ్రాడూన్‌ సుందరి లావణ్యత్రిపాఠి. ‘అందాలరాక్షసి’ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ భామకు యువతరంలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం సొంతఊరు డెహ్రాడూన్‌లో విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్న ఈ సొగసరి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చింది. చేతికి రింగ్‌ కనిపిస్తుంది..రహస్యంగా పెళ్లిచేసుకున్నారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘అమ్మాయిలు సొంతంగా ఉంగరాలు కొనుక్కోకూడదా? ఇది నాకు నేను ప్రేమగా ఇచ్చుకున్న బహుమతి’ అని వ్యాఖ్యానించింది. కెరీర్‌పరంగా ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నకు..తాను నిరంతరం కలల్ని సాఫల్యం చేసుకోవాలని తపిస్తానని, జీవితంలో ఎప్పుడు నిరుత్సాహపడనని పేర్కొంది. పెళ్లెప్పుడని ఓ అభిమాని అడగ్గా ‘నా పేరెంట్స్‌ కూడా ఇప్పటివరకు ఈ ప్రశ్న అడగలేదు. నా పెళ్లి గురించి నీకు తొందరేముంది’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ఐపీఎల్‌ టోర్నీలో తాను ఎప్పుడూ హైదరాబాద్‌ జట్టు వైపే ఉంటానని లావణ్యత్రిపాఠి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌' ‘చావుకబురు చల్లగా’ చిత్రాల్లో నటిస్తోంది.


logo