1980 దశకం నుంచే సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌కౌచ్ సమస్య ఉన్నదని చెప్పింది బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. సినీ ప్రయాణంతో పాటు ఇండస్ట్రీలో ఉండే రాజకీయాలు, క్యాస్టింగ్‌కౌచ్ వంటి సమస్యల గురించి తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’లో నీనాగుప్తా ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ‘కెరీర్ ఆరంభంలో సినిమా ప్రయత్నాల కోసం అన్వేషిస్తున్న సమయంలో ఓ దక్షిణాది ప్రొడ్యూసర్ నుంచి ఫోన్ కాల్వచ్చింది. తనను కలవమని అడగటంతో సందేహిస్తూనే ఆ నిర్మాత ఉన్న హోటల్ రూమ్‌కు వెళ్లాను. తాను ఎంతో మంది కథానాయికల్ని దక్షిణాది చిత్రసీమకు పరిచయం చేశానని ఆ నిర్మాత నాతో చెప్పాడు. తన సినిమాలో కథానాయిక స్నేహితురాలి పాత్రకోసం నన్ను తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకు ప్రతిఫలంగా రాత్రి తనతో హోటల్ రూమ్‌లో గడపాలని అన్నారు. అతడి ఆఫర్‌ను తాను తిరస్కరించి అక్కడి నుండి వచ్చేశాను’ అని ఆత్మకథలో నీనాగుప్తా పేర్కొన్నది. ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు.