శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 13:42:00

'నా ఆచూకీ ఎన్సీబీ అధికారుల‌కు తెలుసు '

'నా ఆచూకీ ఎన్సీబీ అధికారుల‌కు తెలుసు '

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచార‌ణ‌లో డ్ర‌గ్స్ లింక్స్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఎన్సీబీ ద‌శ‌ల వారీగా విచార‌‌ణ కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు ఇప్ప‌టికే ప‌లువురు సుశాంత్ కోస్టార్లను విచారించారు. అయితే ఇటీవ‌లే ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా సుశాంత్  కోస్టార్ స‌ప్నా ప‌బ్బికి స‌మ‌న్లు జారీచేసినా ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేద‌ని ఎన్సీబీ అధికారి ఒక‌రు వెల్ల‌డించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో స‌ప్నా ప‌బ్బి స్పందించింది.

 'నేను అందుబాటులో లేన‌ట్టు, క‌నిపించ‌కుండా పోయిన‌ట్టు మీడియాలో క‌థ‌నాలు రావ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌పోయా. నేను లండ‌న్ లోని మా ఇంటికి వ‌చ్చేశాను. ప్ర‌స్తుతం నా కుటుంబంతో ఉన్నాను. ఎన్సీబీ స‌మ‌న్లపై నా త‌ర‌పు న్యాయ‌వాదులు ఇప్ప‌టికే సంబంధిత అధికారుల‌తో క‌మ్యూనికేట్ అయ్యారు. నేనెక్క‌డున్నానో అధికారులకు పూర్తిగా తెలుసున‌ని ' ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. 

డ్ర‌గ్స్  కేసులో అక్టోబ‌ర్ 19న అర్జున్ రాంపాల్ స్నేహితురాలు  గాబ్రియెల్లా డెమిట్రియాడ్స్ సోద‌రుడు అగిసిలావోస్ ను ముంబై లోనావాలా ఏరియాలోని రిసార్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల స‌మ‌యంలో అగిసిలావోస్ ఇంట్లో నిషేధిత అల్ఫాజోల‌మ్ ట్యాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీ అధికారులు విచారించ‌గా..స‌ప్నా ప‌బ్బి పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో స‌ప్నా ప‌బ్బికి విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా స‌మ‌న్లు జారీచేసినా..ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేద‌ని, ఒక‌వేళ ఆమె స్పందించ‌క‌పోతే త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎన్సీబీ అధికారి ఒక‌రు తెలిపిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.