నందకిశోర్ కథానాయకుడిగా నటిస్తూ టి. ఫణిరాజ్గౌడ్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్లా దర్శకుడు. సిరి హనుమంతు, ఉష ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, హీరో శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ‘ట్రైలర్ బాగుంది. జడ్చర్లకు చెందిన ఫణిరాజ్ స్వీయప్రతిభతో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.వందశాతం ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకముంది. జడ్చర్లలో మొదటి రోజు థియేటర్లో ఈ సినిమా చూస్తాను’ అని చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘చిత్రసీమలో రాణించడం సులభం కాదు. సినిమాల్లో నటించాలనే తపనతో నందకిషోర్ ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరకు ‘నరసింహపురం’ సినిమాతో తన కలను నెరవేర్చుకున్నాడు’ అని పేర్కొన్నారు. సినిమాలో చక్కటి వేరియేషన్స్‌ను కనబరుస్తూ భిన్న పార్శాలతో కూడిన పాత్రలో నందకిశోర్ నటన బాగుందని శ్రీకాంత్ అన్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిదని నందకిశోర్ తెలిపారు.