కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ఉపశీర్షిక. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. పౌరాణిక అంశాల కలబోతగా సాగే ఈ సినిమా ద్వారా వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శుక్రవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శత్రుసైనిక సంహారం చేసి వారి శవాల గుట్టపై కూర్చొని ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు కల్యాణ్‌రామ్. కల్యాణ్‌రామ్ తొలిసారి నటిస్తున్న పౌరాణిక చిత్రమిదని..కథా నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ప్రధానంగా కల్యాణ్‌రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. కరోనా ప్రభావంతో చిత్రీకరణ వాయిదా వేశాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి షూటింగ్‌ను మొదలుపెడతాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. కేథరిన్ ట్రెసా, సంయుక్తామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు, సంగీతం: చిరంతన్‌భట్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, వీఎఫ్ఎక్స్: అనిల్ పడూరి, దర్శకత్వం: వశిష్ట్.