e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News Tollywood | ఎఫ్ 2 సినిమాలో ఆఫ‌ర్ ముందు నానికి వ‌చ్చిందా?

Tollywood | ఎఫ్ 2 సినిమాలో ఆఫ‌ర్ ముందు నానికి వ‌చ్చిందా?

పక్కింటి కుర్రాడిలా కనిపించే నటుడు నాని. సహజ నటనతో ఆకట్టుకునే ఈ యువ కథానాయకుడు నటించిన తాజా చిత్రం టక్‌ జగదీష్‌. సున్నితమైన కుటుంబ భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం వినాయ‌క చ‌వితి కానుక‌గా అమెజాన్ ప్రైమ్‌వీడియోస్‌లో విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా నానితో న‌మ‌స్తే తెలంగాణ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

టక్‌ జగదీష్‌ థియేటర్‌లో వస్తే బాగుండేదని మీ అభిమానులు కోరుకున్నారు కదా..?

ప్రస్తుతం ఉన్న కరోనా అనిశ్చిత పరిస్థితుల కారణంగా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నాం. నాకు థియేటర్‌లో సినిమా చూడటమే ఇష్టం. బిగ్‌స్క్రీన్‌ను మిస్‌ అవుతున్నానని నేనూ ఫీలవుతున్నా. కానీ తప్పడం లేదు. పరిస్థితులన్నీ కుదుటపడిన తర్వాత నా తదుపరి సినిమాలన్నీ థియేటర్ల‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ సినిమా ప్రయాణం గురించి..?

- Advertisement -

తొలుత దర్శకుడు శివ ఈ సినిమా కథ మొత్తం కాకుండా ఓపెనింగ్‌ లైన్‌తో పాటు ఆరంభ సన్నివేశం గురించి చెప్పాడు. ‘మగపిల్లాడు ఏడవకూడదు. ఆడపిల్లను ఏడిపించకూడదు. అది ఇంటికి, ఊరికి మంచిది కాదు..’ అనే సంభాషణతో చెప్పిన ఇంట్రడక్షన్‌ సీన్‌ నన్ను కట్టిపడేసింది. అంతకుముందు తాను తీసిన ప్రేమకథల్లా కాకుండా ఏదో ఒక కొత్త పాయింట్‌ను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడని అర్థమైంది. దాంతో మరో ఆలోచన లేకుండా సినిమాకు అంగీకరించా. కుటుంబ అనుబంధాలకు అద్దంపట్టే అద్భుతమైన కథ ఇది.

నాని టక్‌ జగదీష్‌

టక్‌ జగదీష్‌ టైటిల్‌ కొత్తగా ఉందంటున్నారు..?

ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్‌కు మంచి పేరుంటుంది. పల్లెల్లో మాదిరిగా అందరికి పరిచమమున్న సహజమైన పేర్లు వినిపిస్తాయి. తొలుత ఈ కథ అనుకున్నప్పుడే ఈ టైటిల్‌ అనుకోలేదు. టక్‌ జగదీష్‌ అన్నది సినిమాలో నా పాత్ర పేరు. హీరో జగదీష్‌ చిన్నప్పటి నుంచి టక్‌ వేసుకొనే కనిపిస్తాడు. దాంతో వాడిని అందరు టక్‌ జగదీష్‌ అని పిలుస్తుంటారు. అయితే సెకండాఫ్‌లో వాడికి టక్‌ అంటే ఎందుకు ప్రేమో వివరించే సన్నివేశం హైలైట్‌గా ఉంటుంది. అదేంటో సినిమాలోనే చూడాలి.

ఐశ్వర్య రాజేష్‌ పాత్ర కథాగమనంలో కీలక‌మని తెలిసింది?

ఇందులో రీతూవర్మ నా సరసన కథానాయికగా నటించింది. ఆమె పాత్ర అందంగా, అల్లరిగా సాగుతుంది. ఇక ఐశ్వర్యరాజేష్‌ పాత్ర ఈ కథకు ఆయువుపట్టులా ఉంటుంది. సినిమాలో ఆమె నా మేనకోడలు చంద్రమ్మగా కనిపిస్తుంది. చంద్రమ్మ కోసం జగదీష్‌ ఎంత వరకు వెళ్తాడన్నదే సినిమాలోని ప్రధానమైన అంశంగా ఉంటుంది. ఈ సినిమాలో నా అన్నయ్య బోసు పాత్రలో జగపతిబాబు కనిపిస్తారు. ఇద్దరన్నదమ్ముల మధ్య అనుబంధం, సంఘర్షణ హృదయాల్ని కదిలించేలా ఉంటుంది.

నాని టక్‌ జగదీష్‌

ఈ మధ్యకాలంలో భిన్న జోనర్స్‌లో సినిమాలు చేయడానికి కారణం?

నా దృష్టిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే కేవలం వినోదం కాదు. జోనర్‌తో సంబంధం లేకుండా రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టగలిగే సినిమా ఏదైనా ఎంటర్‌టైనరే. ఓ నటుడిగా అన్ని రకాల సినిమాల్ని చేయాలనుకుంటున్నా. ‘నటుడు తన అభినయంతో నవ్వించాలి, ఏడిపించగలగాలి..అలాంటి వారే అసలైన యాక్టర్స్‌’ అని నా చిన్నతనంలో మా బాబాయ్‌లు అన్న మాటలు బాగా మనసులో నాటుకుపోయాయి. కెరీర్‌ తొలినాళ్లలో నేను కామెడీ సినిమాలు బాగా చేశాను. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణం, నిన్నుకోరి, జెర్సీ వంటి ఎమోషనల్‌ కథల్ని ఎంచుకున్నా. నేను విరామం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటా. ఈ క్రమంలో విభిన్నమైన కథల్ని ఎంపిక చేసుకుంటూ నటుడిగా నన్ను నేను పరీక్షించుకుంటున్నా. ఇక కథ విషయంలో ఏదో ఒక ఎక్సైట్‌మెంట్‌ ఉంటేనే సినిమాకు ఒప్పుకుంటున్నాను.

కథాంశాల ఎంపికలో మీ ప్రాధామ్యాల గురించి..?

ఇక నుంచి మీరు ప్రతి సినిమాలో కొత్త నానిని చూస్తారు. నా తర్వాతి చిత్రం ‘అంటే సుందరానికి’ ఫస్ట్‌లుక్‌ దసరాకు రాబోతుంది. అది అందరికి సర్‌ప్రైజ్‌లా ఉంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలో నన్ను నేను కొత్తగా అన్వేషించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నా.

మీరు వదులుకున్న సినిమాలు పెద్ద విజయం సాధించిన సందర్భాలేమైనా ఉన్నాయా?

కొన్ని సినిమా కథలు అద్భుతంగా ఉంటాయి. స్టోరీ విన్నప్పుడే పెద్ద సక్సెస్‌ అవుతాయనే నమ్మకం ఏర్పడుతుంది. కానీ అవి నాకు సరిపడని కథలు కావనే భావనతో వదులుకోవాల్సి వస్తుంది. అలా నేను వద్దనుకున్న చాలా సినిమాలు భారీ విజయాల్ని సాధించాయి కూడా. అట్లీ దర్శకత్వం వహించిన ‘రాజా రాణీ’ సినిమా ఆఫర్‌ తొలుత నాకే వచ్చింది. అయితే ఈ సినిమా చేద్దామనుకున్నా. కానీ అప్పుడు ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ‘పైసా’ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నా. అలాగే ‘ఎఫ్‌-2’ లో కూడా నన్నే అడిగారు.

ఓటీటీలో విడుదలైన ‘వి’ సినిమా ఫలితం సంతృప్తినిచ్చిందా?

థియేటర్‌లో విడుదలైన సినిమాల తరహాలో ఓటీటీ చిత్రాలకు వసూళ్ల లెక్కలు ఉండవు. అందుకే ఓటీటీ చిత్రాలు ఏస్థాయిలో విజయం సాధించాయనే విషయాన్ని నిరూపించే సాధనాలు లేవు. అయితే ‘వి’ విడుదలైన మూడు రోజుల తర్వాత మా టీమ్‌ అందరికి అమెజాన్‌ మెయిల్స్‌ పంపించి..‘మొత్తం పది మార్కులకుగాను ఈ సినిమా 21 మార్కులు సంపాదించింది’ అని పేర్కొన్నారు. దీనినిబట్టి సినిమా ఫలితం ఎలా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ‘వి’ సినిమాతో అమెజాన్‌ సంస్థ హ్యాపీగా ఉంది. నిర్మాత దిల్‌రాజు కి లాభాలొచ్చాయి. అలాంటప్పుడు ఈ సినిమా ఎక్కడ ఫెయిల్‌ అయిందో నాకు అర్థం కావడం లేదు ’(నవ్వుతూ).

రీమేక్‌ సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు..?

రీమేక్‌ సినిమాలు చేయాలనుకోవడం లేదు. కెరీర్‌ ఆరంభంలో ‘భీమిలి కబడ్డీ జట్టు’ ‘ఆహా కల్యాణం’ వంటి రీమేక్‌లు చేశా. ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు. నటుడిగా నాకే తెలియని కొత్తద‌నాన్ని వెలికితీయాలనే తపనతో ఉన్నా. అందుకే ఇక ముందు రీమేక్‌కు చేయొద్దనుకుంటున్నా. అయితే నేను తెలుగులో నటించిన దాదాపు ఐదారు చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్‌ అవుతుండటం ఆనందంగా ఉంది.

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్‌పై మీ అభిప్రాయం?

రాబోయే రెండేళ్లలో పాన్ ఇండియా అనే మాట వినపడదనుకుంటున్నా. ప్రస్తుతం వివిధ రకాలైన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ప్రేక్షకులు ఇతర భాషల చిత్రాలతో పాటు ప్రపంచ సినిమాను వీక్షిస్తున్నారు. దాంతో అన్ని భాషల సినిమాలు తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నాయి. సబ్ టైటిల్స్‌ వల్ల ఆడియెన్స్‌ ఒరిజినల్‌ లాంగ్వేజ్‌లో చిత్రాల్ని చూస్తున్నారు. ఈ ట్రెండ్‌తో మున్ముందు సినిమాలకు కంటెంట్‌ ప్రధానంగా మారుతుంది. పాన్ ఇండియా అని ఆలోచించకుండా వినూత్న కథలపై దృష్టి పెడితే మంచి ఫలితాల్ని సాధించవొచ్చు.

మీ సినిమాలు వరుసగా ఓటీటీలో రావడంతో అభిమానులు థియేటర్‌లో సినిమా చూడలేకపోతున్నారు కదా..?

లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఎంతో జాగ్రత్తగా షూటింగ్స్‌లో పాల్గొన్నా. విశ్రాంతి లేకుండా నాన్‌స్టాప్‌గా పనిచేశా. దాంతో ఇప్పుడు నా సినిమాలు విడుదలకు సిద్ధమై ఉన్నాయి. అదే ఏడాదికో సినిమా చేస్తే అప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. పరిస్థితులకు అనుగుణంగానే ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తోంది. పండగరోజు టక్‌ జగదీష్‌ సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నా. ఇంతకుమించిన ఆనందం ఏముంటుంది?. రేప్పొద్దున‌ పరిస్థితులు చక్కబడితే థియేటర్‌లో రావడానికి ‘శ్యామ్‌సింగరాయ్‌’ ‘అంటే సుందరానికి’ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి వేదికైనా ప్రేక్షకుల్ని అలరించడమే ప్రధానమని నమ్ముతున్నా. అయితే ఓటీటీలకు అలవాటు పడి ప్రేక్షకులు థియేటర్లను మర్చిపోతున్నారనే భావనలో అర్థం లేదు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి థియేటర్లు ఓపెన్‌ అయితే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. బిగ్‌స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొట్టే ఛాన్స్‌ ఈ ప్రపంచంలో దేనికి ఉండదని నా అభిప్రాయం.

– సినిమా డెస్క్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

ఏ భాష మాట్లాడి అవమానపడ్డదో, ఆ భాషకే బ్రాండ్‌ అంబాసిడరైంది..

ఫోన్ సిగ్న‌ల్స్ కూడా లేని ప్రాంతంలో ర‌ష్మిక‌.. ద‌ర్శ‌కుడికి సారీ చెప్పిన క‌న్న‌డ బ్యూటీ

Pawan: ‘భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌’గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫస్ట్ లుక్ విడుద‌ల‌

అమెజాన్ ప్రైమ్‌లో నాని ట‌క్ జ‌గ‌దీష్‌.. ఓటీటీలో సినిమాల రిలీజ్‌పై గోపీచంద్ రియాక్ష‌న్ ఇది

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana