సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 01:52:35

అలాంటి పాత్రలే సంతృప్తిని ఇచ్చాయి

అలాంటి పాత్రలే సంతృప్తిని ఇచ్చాయి

వినోదాత్మక కథాంశాలతో నవతరం కథానాయకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు అల్లరినరేష్‌. ఆయన సినిమాల్ని నవ్వులకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెబుతారు. గత కొంతకాలంగా సినిమాల వేగాన్ని తగ్గించారాయన. కథాంశాలు, పాత్రల ఎంపికలో తన పంథాను మార్చుకొని వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తున్నారు.  నేడు అల్లరి నరేష్‌ జన్మదినం. ఈ సందర్భంగా తన కెరీర్‌ ప్రణాళికలతో పాటు లాక్‌డౌన్‌ విరామ ముచ్చట్లను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. 

ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి? 

లాక్‌డౌన్‌లో పుట్టినరోజును జరుపుకోవడం కొత్తగా అనిపిస్తోంది. నా సతీమణి,  కూతురు కలిసి ఓ స్పెషల్‌ కేక్‌ తయారుచేస్తున్నారు. వాళ్ల సమక్షంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా ఈ వేడుకను సెలబ్రేట్‌ చేసుకోబోతున్నా.

మూడు నెలల పాటు ఇంట్లోనే బందీ కావడం ఇబ్బందిగా అనిపించిందా?

వేసవిలో నా సినిమాల్ని విడుదలచేయాలని ప్లాన్‌చేశా. అవన్నీ వాయిదా పడటంతో నిరాశపడ్డా. కరోనా వైరస్‌కు  పరిష్కారమనేది లేదు.  ప్రపంచం మొత్తం ఈ సమస్యను ఎదుర్కొంటోంది.  తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎదురుచూడటం తప్ప   మరో మార్గం లేదు. కుటుంబసభ్యుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అంతా సర్దుకున్న తర్వాతే షూటింగ్స్‌లో పాల్గొంటేనే మంచిదనే ఆలోచనతో ఉన్నా.  అప్పటివరకు ఎలాంటి రిస్క్‌ తీసుకోకూడదనుకుంటున్నా. 

కరోనా నుంచి రక్షణ కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

కరోనా ప్రభావం దృష్ట్యా కొన్ని నెలలుగా ఎవరిని కలవడం లేదు. ఇల్లుదాటి కాలు బయటపెట్టలేదు.  ఈ విరామంలో కుటుంబసభ్యులతో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నా.  రోజంతా భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తున్నా. వారితో అనుబంధం మరింత బలపడింది.  ఇంటిపనుల్లో నా భార్యకు సహాయపడుతున్నా. వంట చేయడం నేర్చుకున్నా. నల్లిబిర్యానీ చేయడంలో స్పెషలిష్ట్‌ అయ్యా. థాయ్‌ నా ఫెవరేట్‌ ఫుడ్‌. లాక్‌డౌన్‌లో కొత్త వెరైటీస్‌ చాలా ట్రైచేశా. 


‘మహర్షి’ సినిమా నటుడిగా మీకు మంచి పేరుతెచ్చిపెట్టింది? మళ్లీ అలాంటి పాత్రల్లో నటిస్తారా?

‘గమ్యం’, ‘మహర్షి’ చిత్రాలు సక్సెస్‌, పేరు కంటే నటుడిగా చక్కటి సంతృప్తినిచ్చాయి. మహేష్‌బాబుతో పోల్చుకుంటే నా అభిమాగణం తక్కువే. ఆయనతో కలిసి నటించడం వల్ల నన్ను అభిమానించేవారి సంఖ్య పెరిగింది. అంతేకాకుండా సీరియస్‌ పాత్రలకు  పరిపూర్ణంగా న్యాయం చేయగలనని ఈ సినిమా నిరూపించింది. ‘మహరి’్ష వల్లే ‘నాంది’ సినిమాలో అవకాశం వచ్చింది.

థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ మారిపోతుందనే వాదన ఉంది? అందులో వాస్తవం ఏమిటి?

ఓటీటీ కొత్తవాళ్లకు,  ఎలాంటి సినీ నేపథ్యం లేనివారికి ప్రోత్సాహకరంగా నిలుస్తుంది. ఓటీటీలో సినిమాల్ని  ఎక్కువగా పట్టణాల వారే వీక్షిస్తుంటారు. ఓటీటీ పోల్చితే థియేటర్‌ వల్లే ఎక్కువ మందికి సినిమా చేరువ అవుతుంది.  ఓటీటీ, థియేటర్‌ ఎక్కడైనా కంటెంట్‌ ముఖ్యం. బలమైన కంటెంట్‌ లేకపోతే ఓటీటీలో ఉచితంగా ప్రదర్శించిన ఎవరూ సినిమా చూడరు. థియేటర్‌లో సినిమా చూసిన అనుభూతి ఏదీ ఇవ్వలేదు.  భయాలు తొలగిపోయి థియేటర్లు ప్రారంభమైతే ప్రేక్షకులు సినిమాల్ని చూడటానికి వస్తారు.  

‘నాంది’లో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు?ఇందులో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?

రియలిస్టిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ‘నటుడిగా నీ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు’ అంటూ ఫస్ట్‌లుక్‌ చూసి ఇండస్ట్రీలోని  చాలా మంది అభినందిస్తున్నారు.  కామెడీ కాకుండా పవర్‌ఫుల్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా చేస్తున్నా. వందమంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు కానీ ఒక్క  నిర్దోషికి శిక్షపడకూడదనే  ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో సమకాలీన సమస్యను ఆధారంగా చేసుకొని దర్శకుడు సినిమాను రూపొందిస్తున్నారు. 


logo