శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 20:47:29

సినిమా చూపించిన నాగార్జున..వణికిపోయిన అఖిల్

సినిమా చూపించిన నాగార్జున..వణికిపోయిన అఖిల్

నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇక్కడ మాత్రం ఇదే జరిగింది. ఇక్కడ అఖిల్ అంటే కొడుకు అఖిల్ కాదు..బిగ్ బాస్ షోలో ఉన్నాడు కదా అఖిల్ సార్థక్ ఆయనన్నమాట. బిగ్ బాస్ షో చివరి దశకు వచ్చేయడంతో నాగార్జున కూడా బాగానే ఓపెన్ అయిపోతున్నాడు. ఒక్కొక్కరితో ఆడుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సన్ డే ఎపిసోడ్.. ఫన్ డే ఎపిసోడ్ కాబట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు ఓ సినిమా చూపించాడు నాగార్జున. అది చూసిన తర్వాత కొందరు పడి పడి నవ్వుకున్నారు.. కానీ మరికొందరు మాత్రం ఇంక చాలు ఆపేయండి బాబూ అంటూ వేడుకున్నారు. అభిజీత్, హారిక లాంటి వాళ్లు నవ్వుకునే లిస్టులోకి వస్తే.. వేడుకునే లిస్టులో సోహైల్, అఖిల్ చేరిపోయారు. అవినాష్ ను సపరేట్ గా ఆడుకున్నాడు నాగార్జున. అరియానా అసలు లిస్టులోనే లేదు. ఎందుకంటే దెయ్యం సౌండ్ వినిపించగానే కిలోమీటర్ పరిగెత్తుతుంది ఈ భామ. 

ఇదిలా ఉంటే మొన్న దెయ్యం టాస్కులో భాగంగా కన్ఫెషన్ రూమ్ కు ఇద్దరిద్దరిని పంపించి అక్కడ ఉన్న స్పూన్ తీసుకురావాలని చెప్పాడు బిగ్ బాస్. అప్పుడు అంతా ధైర్యంగానే ఉన్నా కూడా అరియానా మాత్రం వణికిపోయింది. ఇక బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన సోహైల్, అఖిల్.. చీకటి గదిలోకి వెళ్లేసరికి వణికిపోయారు. వాటికి సంబంధించిన వీడియోలను ఇప్పుడు సినిమాగా చేసి కంటెస్టెంట్స్ ముందు పెట్టాడు నాగార్జున. దాంతో అంతా పగలబడి నవ్వేసారు. అక్కడితో ఆగిపోకుండా ఈ సారి ఒక్కొక్కరుగా చీకటి గదిలోకి వెళ్లాలని చెప్పాడు నాగ్. అన్నట్లుగానే కొందరు వెళ్లొచ్చారు కానీ అఖిల్, సోహైల్ మాత్రం మరోసారి భయపడిపోయారు. అరియానా అయితే గుమ్మం దగ్గర్నుంచే పరార్. అలా మొత్తానికి తన సినిమాతో చుక్కలు చూపించాడు నాగార్జున. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.