శుక్రవారం 27 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 23:55:02

దసరా వేళ ఆరంభ హేల

దసరా వేళ ఆరంభ హేల

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ఏది తలపెట్టిన జయప్రదంగా జరుగుతుందని  విశ్వసిస్తుంటారు. సినీ పరిశ్రమలో దసరా సెంటిమెంట్‌కు ఎక్కువగా ప్రాముఖ్యముం టుంది. కరోనా కారణంగా కళ తప్పిన చిత్రసీమలో ఈ దసరా సంతోషాల్ని నింపింది.  కొత్త సినిమాల ప్రారంభోత్సవాలతో విజయదశమి రోజున సినీ పరిశ్రమ  కళకళలాడింది.  దసరా సందర్భంగా పలు తెలుగు  చిత్రాలు పూజా కార్యక్రమాలతో మొదలయ్యాయి. 

నాగచైతన్య ‘థాంక్యూ’.. 

‘మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌. కె.కుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌, హర్షిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఆదివారం పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు.   తొలి సన్నివేశానికి ఫైనాన్సియర్‌ సత్య రంగయ్య క్లాప్‌నిచ్చారు. ‘త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. నాగచైతన్య, విక్రమ్‌. కె.కుమార్‌ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉం టుంది. మునుపెన్నడూ కనిపించనటువంటి సరికొత్త పాత్రలో నాగచైతన్యను దర్శకుడు ఆవిష్కరించబోతున్నారు. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని ప్రకటిస్తాం’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌, సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్‌, కథ, మాటలు: బీవీఎస్‌ రవి.