‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రం ద్వారా యువహీరో నాగచైతన్య బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర కథానాయకుడు అమీర్‌ఖాన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ (1994) ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య ఆర్మీ అధికారిగా కీలక పాత్రలో కనిపించనున్నారు. తొలుత ఈ పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకోవాలని అనుకున్నారు. డేట్స్ సర్దుబాటు కాకపోడంతో ఆయన స్థానంలో నాగచైతన్యను ఎంపిక చేసుకున్నారు. ఆర్మీ అధికారి పాత్ర కోసం నాగచైతన్య ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కఠినమైన వ్యాయామాలతో శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్ లడఖ్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్లో నాగచైతన్య పాల్గొంటున్నారని, ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య ‘లవ్‌స్టోరి’ ‘థాంక్యూ’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.