శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 10:48:19

వ‌స్త్ర వ్యాపారంలోకి సామ్.. విషెస్ చెప్పిన నాగ్

వ‌స్త్ర వ్యాపారంలోకి సామ్.. విషెస్ చెప్పిన నాగ్

అక్కినేని కోడలు సమంత ఒక‌వైపు సినీ రంగంలో త‌న స‌త్తా చాటుతూనే వ్యాపార రంగంలోను దూసుకుపోతుంది.  ఇప్ప‌టికే జూబ్లీహిల్స్‌లో స్నేహితుల‌తో క‌లిసి ఏక్కం అనే ప్రీ స్కూల్ బిజిస్‌ను స్టార్ట్ చేసిన సామ్ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టింది. సరికొత్త ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఆవిష్కరించే వస్త్ర బ్రాండ్‌ ‘సాకీ’ని లాంచ్‌ చేసింది. తన వస్త్ర వ్యాపారాన్ని సోషల్‌ మీడియా వేదికగా  అందరికి పరిచయం చేసింది. సాకీ పేరుతో మహిళల ఫ్యాషన్‌ దుస్తులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. సరికొత్తగా కనిపించాలనుకోవడం అందరికి చాలా ఇష్టమని.. అందుకు తగినట్లుగానే సాకీ బ్రాండ్‌ అందుబాటులో ఉంటుందని వివరించింది.

కాలేజీ అమ్మాయిలు, మహిళలు ప్రతి ఒక్కరిని ఫ్యాషన్‌ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘సాకీ’ డిజైన్స్‌ ఉంటాయని పేర్కొంది స‌మంత‌. మిస్‌ ఇండియా-2016 ఫస్ట్‌ రన్నరప్‌ సుశృతి కృష్ణ, సమంత ఫౌండర్లుగా సాకీ బ్రాండ్‌ను తీసుకొచ్చారు. సరికొత్త డిజైన్‌లతో ఆకట్టుకునే వస్ర్తాలను విక్రయించనున్నట్టు తెలిపారు. మహిళలు ముఖ్యంగా తాము ధరించే వస్ర్తాలు చాలా ప్రత్యేకంగా ఉండాలనుకుంటారని.. అలాంటి అంచనాలకు తగ్గట్టుగా సాకీ నిలుస్తుందని చెప్పారు. తన కలలకు ప్రతిబింబం ఈ సాకీ అంటూ సమంత కొద్ది రోజుల క్రితం ట్విట్టర్‌లో పేర్కొంది సామ్. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 28) ఉదయం 9 గంటల 35 నిమిషాలకు సాకీ కలల ప్రపంచాన్ని జనం ముందుకు తెచ్చింది స‌మంత‌. ఈ సంద‌ర్భంగా నాగార్జున.. సాకీకు సంబంధించిన లింక్‌ను షేర్ చేస్తూ.. గుడ్ మార్నింగ్ నా ప్రియ‌మైన కోడ‌లా..! కొత్తగా మొద‌లు పెట్టిన వ‌స్త్ర వ్యాపారంలో నువ్వు త‌ప్ప‌క రాణిస్తావు అంటూ విషెస్ అందించారు .  మ‌రోవైపు స‌మంత భ‌ర్త నాగ చైతన్య‌తో పాటు ప‌లువురు నెటిజ‌న్స్ సామ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.


logo