అక్కినేని నాగార్జున కెరియర్లోని బెస్ట్ చిత్రాలలో సోగ్గాడే చిన్ని నాయన ఒకటి. ఇందులో బంగార్రాజు పాత్ర పోషించి ప్రేక్షకులని అలరించాడు నాగ్. ఇప్పుడు ఆ పాత్ర పేరుతో ప్రీక్వెల్ చేయనున్నట్టు గతంలో ప్రకటించాడు. పలు కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.
ఆగిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి. కాని సినిమా స్టార్ట్ అవుతుందని వైల్డ్ డాగ్ ప్రమోషన్ కార్యక్రమంలో నాగ్ క్లారిటీ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ఆగస్ట్ 20 నుండి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేక సెట్ వేయగా, అందులో నాగ్, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట.
నాగ చైతన్య కూడా ఇందులో ముఖ్య పాత్ర చేయనుండగా, ఇందులో చైతూ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తుందట. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నాగ్ ఇందులో చిలిపి తాతగా కనిపించి సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘మనం’ తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.