గురువారం 04 జూన్ 2020
Cinema - May 17, 2020 , 23:16:49

కథ తర్వాతే పారితోషికం!

కథ తర్వాతే పారితోషికం!

‘నన్ను దోచుకుందువటే’ అంటూ తొలి చిత్రంతోనే యువతరం హృదయాల్ని కొల్లగొట్టింది కన్నడ కస్తూరి నభానటేష్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో ఈ అమ్మడి ఇమేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ సినిమాలో డేర్‌ అండ్‌ డాషింగ్‌ వరంగల్‌ అమ్మాయి పాత్రలో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ సొగసరి లాక్‌డౌన్‌ సమయాన్ని సొంత నగరం బెంగళూరులో గడుపుతోంది. ఈ సందర్భంగా తన భవిష్యత్తు ప్రణాళికల గురించి నభానటేష్‌ చెప్పిన సంగతులివి..

లాక్‌డౌన్‌ టైమ్‌ను ఎలా గడుపుతున్నారు?

మొదటి రెండువారాలు చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు నాలుగునెలల పాటు విశ్రాంతి లేకుండా పనిచేశాను. దాంతో లాక్‌డౌన్‌ కాలాన్ని ఆనందంగా గడపాలి అనుకున్నా. రెండు వారాల తర్వాత నా స్వేచ్ఛను ఎవరో హరించుకుపోయారనే భావన కలిగింది. మళ్లీ సినిమాలు, షూటింగ్‌ల హంగామా ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.

రాబోవు కాలంలో సినీరంగం పరిస్థితి ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు?

తప్పకుండా పరిస్థితులన్నీ సర్దుకుంటాయి.  ప్రపంచమానవాళి అంతా భవిష్యత్తు మీద ఆశావహదృక్పథంతో ఉన్నారు. ఇక సినీరంగం విషయానికొస్తే..థియేటర్లు తిరిగి తెరచుకోవాలని, కుటుంబమంతా కలిసి బిగ్‌స్క్రీన్‌ మీద సినిమాల్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

ఈ విరామ సమయంలో కొత్త స్క్రిప్ట్‌లు ఏమైనా విన్నారా?

స్క్రిప్ట్‌లు ఏమీ వినలేదు. కానీ కొన్ని స్టోరీ లైన్స్‌ నాకు పంపించారు. ఇంకా వాటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో స్క్రిప్ట్‌లు విన్నాకే సినిమాల్ని అంగీకరించే విషయం ఆలోచిస్తా.

కన్నడ చిత్రం ‘వజ్రకాయ’తో నాయికగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కన్నడ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారెందుకు?

ఈ విషయంలో నాకు బాధగా ఉంది. మాతృభాష కన్నడంలో ఎందుకు ఆఫర్లు రావడం లేదన్నది అర్థం కానీ ప్రశ్నలా మిగిలిపోయింది. దర్శకనిర్మాతల్ని అడిగితే సరైన సమాధానం దొరుకుతుందేమో?

తెలుగు వచ్చిన సక్సెస్‌లతో పారితోషికాన్ని భారీగా పెంచారని, దాంతో కన్నడంలో నిర్మాతలు ఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి?

కథ నచ్చిన తర్వాతనే నేను పారితోషికం గురించి మాట్లాడతాను. ఏ భాషా సినిమాలోనైనా ఇదే పద్ధతి ఫాలో అవుతా. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసుకొని ఎవరూ కథలు వినిపించరు.  కథ నచ్చడంతో పాటు దర్శకనిర్మాతల క్రెడిబిలిటీ కూడా పరిగణనలోకి తీసుకొని సినిమా అంగీకరిస్తా. ఆ తర్వాతే రెమ్యునరేషన్‌ గురించి చర్చిస్తా. నేను భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నానని కన్నడ ఇండస్ట్రీలో వస్తున్న వార్తలు పూర్తి నిరాధారమైనవిగా భావించాలి.

కథల ఎంపికలో మీ ప్రాధామ్యాలు ఎలా ఉంటాయి?

నేను థియేటర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చాను కాబట్టి మంచి పాత్రలు చేయాలని కోరుకుంటా. ప్రస్తుతం నాకు దొరుకుతున్న పాత్రల పట్ల సంతోషంగా ఉన్నా. కమర్షియల్‌ చిత్రాల్లో నాయికగా రాణించడం అంత ఈజీ కాదు. అందుకు చాలా శ్రమించాలి.

ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలు చేస్తున్నారు?

సాయిధరమ్‌తేజ్‌ సరసన ‘సోలో బ్రతుకే సో బెటర్‌', సాయిశ్రీనివాస్‌తో కలిసి ‘అల్లుడు అదుర్స్‌' చిత్రాల్లో నటిస్తున్నా. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళ పరిశ్రమలో త్వరలో అరంగేట్రం చేయబోతున్నా.


logo