మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 01:54:34

నా నిజ జీవిత అనుభవాలు గుర్తొచ్చాయి!

నా నిజ జీవిత  అనుభవాలు  గుర్తొచ్చాయి!

‘కథాంశాలు సాంకేతికత పరంగా సినిమాల రూపకల్పనలో చాలా మార్పులొస్తున్నాయి. మంచి కథలతో సినిమాల్ని తెరకెక్కించే ధోరణి పెరిగింది. ప్రతిభావంతులైన దర్శకులు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇవన్నీ శుభపరిణామాలుగా చెప్పొచ్చు’ అని అన్నారు సూర్య. తమిళ చిత్రసీమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్న సూర్య ప్రయోగాత్మక కథాంశాలు, పాత్రలతో తెలుగులో చక్కటి అభిమానగణాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. సుధా కొంగర దర్శకురాలు. నవంబర్‌12న ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా గురువారం హీరో సూర్య పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన కథాంశాలతో మీ భార్య జ్యోతిక సినిమాలు చేస్తున్నారు? తన సినిమాల ఎంపికలో మీ పాత్ర ఎంత ఉంటుంది?

ప్రస్తుతం జ్యోతిక ఎంచుకుంటున్నా సినిమాల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. సమాజంలోని సమస్యల్ని చర్చిస్తూ  తాను సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. పెద్ద సినిమాలనే ఆలోచనతో కాకుండా తను నమ్మిన కథల్ని ధైర్యంగా వెండితెరపై తీసుకురావడం అభినందనీయం. 

ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో కనిపించే డ్యాన్స్‌లు, ఫైట్స్‌ ఇందులో  ఉండవు. రియలిస్టిక్‌ ఎమోషన్స్‌తో వైవిధ్యంగా ఉంటుంది. చంద్రమహేష్‌గా నిత్యజీవితంలో  కనిపించే సగటు మనుషుల్ని పోలి నా పాత్ర ఉంటుంది. సగటు మనిషిగా, ఎయిర్‌ఫోర్స్‌ కెప్టెన్‌గా భిన్న పార్శాలతో సాగుతుంది.  హీరోగానే కాకుండా నిర్మాతగా ఈ సినిమా పూర్తి సంతృప్తినిచ్చింది.

కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడటం మిమ్మల్ని నిరాశపరిచిందా?

 లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఈ విరామం మాకు  గ్రాఫిక్స్‌ పరంగా మరింత నాణ్యతను చూపించడానికి దోహదపడింది.

‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంలో  మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేవి?

సాధారణ వ్యక్తి అసాధారణ  కలలకు దృశ్యరూపమే ఈ చిత్రం. విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు  ఓ వ్యక్తి  ఎలా కారణమయ్యాడు? సామాన్యప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే  క్రమంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లు, అవాంతరాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఏయిర్‌ దక్కన్‌ వ్యవస్థాపకుడు గోపీనాథ్‌ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  మూడేళ్ల క్రితం ఈ కథ గురించి సుధా కొంగర నాతో చెప్పింది. అలా ఈ సినిమా ప్రయాణం ఆరంభమైంది. 

ఈ పాత్ర కోసం మీరు ఎలాంటి పరిశోధన చేశారు?

ఉపాధ్యాయుడి కొడుకు ఎయిర్‌లైన్‌ కంపెనీని ఎలా స్థాపించాడు? వేలాది రూపాయలు ఉన్న విమాన ప్రయాణ వ్యయాన్ని ఒక్క రూపాయికే తీసుకురావడంలో అతడు సాగించిన సాహసోపేత ప్రయాణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. యథార్థ ఘటనలతో  పాటు గోపీనాథ్‌ జీవితంపై వచ్చిన బుక్‌ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. సినిమాలో  నటించడానికి ముందు గోపీనాథ్‌ను ప్రత్యక్షంగా కలిసి కొన్ని విషయాల్ని తెలుసుకున్నా. 

ఈ కథను మొత్తం చదివిన తర్వాతే సెట్స్‌లో అడుగుపెట్టానని అన్నారు? ఎందుకలా?

 సాధారణంగా కథ విన్న తర్వాత  నా ఊహాలకు అనుగుణంగా పాత్రకు ఎలా న్యాయం చేయాలో ఆలోచిస్తుంటా. సెట్స్‌లో దర్శకుడి సూచనల్ని స్వీకరిస్తా. కానీ నా కెరీర్‌లో స్క్రిప్ట్‌రీడింగ్‌ చేసిన తొలిచిత్రమిది. సుధా కొంగర సిద్ధం చేసిన కథను తీసుకొని పూర్తిగా చదివాను. స్క్రిప్ట్‌ రీడింగ్‌ వల్ల పాత్రకు సంబంధించిన తీరుతెన్నులపై షూటింగ్‌కు ముందే పూర్తి అవగాహన కలిగింది. ఆహార్యం, భావోద్వేగాలు, ఇతర పాత్రలతో ఉన్న సంబంధాలేమిటో ముందే తెలియడం వల్ల క్యారెక్టర్‌లో అలవోకగా లీనమయ్యే అవకాశం ఉంటుంది. 

వ్యక్తిగతంగా ఈ సినిమా మీకు బాగా కనెక్ట్‌ అయ్యిందన్నారు?

ఈ సినిమా ప్రయాణంలో నా నిజజీవిత అనుభవాలు చాలా గుర్తొచ్చాయి. మా నాన్న నటుడైనా తనపై ఆధారపడకుండా మేము మా సొంత కాళ్లపై నిలబడాలని చెబుతుండేవారు.    ఆయన మాటలతో  బీకామ్‌ డిగ్రీ పూర్తయిన వెంటనే 736 రూపాయల జీతానికి గార్మెంట్‌ కంపెనీలో పనిచేశా. సొంత గుర్తింపును సృష్టించుకోవడంలో ఉండే కష్టం, ఆనందంగా ఎలా ఉంటాయో ఆ రోజుల్లోనే తెలిసింది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ సంఘటనలన్నీ కళ్లముందు కదలాడాయి. 

ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం సరైందనే అంటారా? ఓ నిర్మాతగా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

ఓటీటీలో సినిమాను విడుదల చేస్తున్నంత మాత్రానా థియేటర్లను తక్కువ చేసినట్లు కాదు. నా బ్యానర్‌లో పది సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ సినిమాల కోసం పనిచేస్తున్న వారి శ్రేయస్సు కోసం నేను కొన్ని అనుకూల నిర్ణయాలు తీసుకోవాలి. అలా ఆలోచించే ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో హీరోగా, నిర్మాతగా  నేను తీసుకున్న నిర్ణయం సరైందనే అనుకుంటున్నాను. 

సినిమాల ఎంపికలో మీరు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే అంశాలేవి?

పాత్రల పరంగా సవాళ్లను నేను ఇష్టపడతాను. అవే నటుడిగా ఎదగడానికి దోహదపడతాయి. ఇప్పటివరకు దర్శకులు సృష్టించిన పాత్రల్లో కనిపించాను. తొలిసారి బయోపిక్‌లో నటిస్తున్నా. స్ఫూర్తిదాయకంగా సాగే ఈ పాత్రలో ఎలా నటించాలి? ఎంతవరకు న్యాయం చేయగలను? ఇలా ఎన్నో భయాల్ని అధిగమిస్తూ నటించాను.