దక్షిణాది చిత్రసీమలో విభిన్నమైన కథాంశాలు, పాత్రలతో ప్రతిభను చాటుకున్న మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవలే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. రెండు వెబ్‌సిరీస్‌లలో నటించి నవతరం నాయికలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా ఆమె కుకింగ్ షోకు ప్రయోక్తగా సరికొత్త అవతారమెత్తబోతున్నది. వివిధ భాషల్లో చక్కటి ప్రజాదరణ పొందిన ‘మాస్టర్ చెఫ్’ రియాలిటీ షోను తెలుగులో రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు వెర్షన్‌కు తమన్నా ప్రయోక్తగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ రియాలిటీ షో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షో కోసం ఆమె భారీ మొత్తంలో పారితోషికాన్ని స్వీకరించిందని చెబుతున్నారు. అయితే తమన్నా మాత్రం రెమ్యునరేషన్ కోసం డిజిటల్ మాధ్యమాల్లోకి అడుగుపెట్టలేదని చెప్పింది. ‘ప్రస్తుతం వెబ్‌సిరీస్, రియాలిటీషోలకు సినిమాలతో సమానంగా ఆదరణ లభిస్తోంది. వెండితెరపై ఆవిష్కరించలేని కొత్త ఆలోచనల్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ చక్కటి వేదికలుగా మారాయి. నటిగా నా ఆలోచన పరిధిని విస్తృతం చేసుకొనే అవకాశం ఉండటంతోనే సిరీస్‌లు, షోలలో నటిస్తున్నా. వెబ్‌సిరీస్‌ల కంటే వాణిజ్యప్రకటనలు, ప్రత్యేకగీతాల్లో నటిస్తే ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. పారితోషికం కంటే సంతృప్తి ముఖ్యం. డబ్బుకు ఎప్పుడూ ప్రాముఖ్యతనివ్వను’ అని తమన్నా తెలిపింది.