వానకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కూరగాయలు ఈ కాలంలో ఎక్కువగా తినాలని చెబుతారు న్యూట్రిషనిస్టులు.
కాకరకాయ: కాకరకాయవల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలకు కారణమయ్యే మైక్రోబ్స్ (సూక్ష్మక్రిములు) దరిచేరవు. కాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
సొరకాయ: ఇందులో పాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలం. కొవ్వు శాతం తక్కువ. సొరకాయ గుజ్జు కూర కడుపులో మంటను తగ్గిస్తుంది.
కీరదోస: ఇందులోని హెపటోప్రొటెక్టివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కాలేయ సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే జ్వరం, సర్దితో వచ్చే నీరసాన్ని తగ్గిస్తాయి.
పుట్ట గొడుగులు (బటన్ మష్రూమ్స్): వీటిని బాగా కడిగి వండుకుని తినొచ్చు. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. పైగా యాంటీ బ్యాక్టీరియల్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి.
ముల్లంగి: రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడే పాలీఫెనాల్స్, ఐసోథియోసైనేట్స్ ముల్లంగిలో ఉంటాయి. శ్వాస సంబంధ వ్యాధులనుకూడా ఇవి తగ్గిస్తాయి.
బీరకాయ: ఇది రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని మలినాలను బయటికి పంపుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బీరకాయలో కెరోటీన్, అమైనో యాసిడ్స్, ప్రొటీన్స్ ఉంటాయి. వీటివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
కందగడ్డ: వానకాలపు గ్యాస్ట్రో సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని ఫెనోలిక్ కాంపౌండ్స్, ఫ్లెవనాయిడ్స్, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతాయి.