సోమవారం 25 మే 2020
Cinema - Apr 04, 2020 , 22:44:32

హీరోలకు మోదీ ప్రశంస

హీరోలకు మోదీ ప్రశంస

ప్రపంచవ్యాప్తంగా కరోనా  విలయతాండవం చేస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ర్టాల్లో ఈ మహమ్మారి ఉధృతి ఎక్కువైంది. కరోనాపై పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు తెలుగు సినీ తారలు. విరాళాలు మొదలుకొని సోషల్‌మీడియాలో స్ఫూర్తిదాయక వీడియోలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, యువహీరోలు సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ కరోనా నిర్మూలన అవశ్యకతను తెలియజేస్తూ ఓ పాటలో నటించిన విషయం తెలిసిందే. కోటి స్వరపరచిన ఈ గీతం వివిధ మాధ్యమాల్లో చక్కటి ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. తాజాగా ఈ పాటపై ప్రధాన నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో స్పందించారు. దేశప్రజలకు అద్భుత సందేశాన్నిచ్చిన హీరోలు మీరంటూ కొనియాడారు. ‘చిరంజీవిగారికి, నాగార్జునగారికి, వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌కి.. మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్లలోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్‌పై విజయం సాధిద్దాం’ అంటూ తెలుగులో చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.


logo