శనివారం 11 జూలై 2020
Cinema - May 28, 2020 , 17:15:01

షూటింగ్స్‌ పున:ప్రారంభంపై చర్చించాం: మంత్రి తలసాని

షూటింగ్స్‌ పున:ప్రారంభంపై చర్చించాం: మంత్రి తలసాని

హైదరాబాద్‌: ఎంసీహెచ్‌ఆర్డీలో సినిమా, టీవీ రంగప్రముఖులతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. ప్రస్తుతం కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో..షూటింగ్స్‌ను తిరిగి ప్రారంభించే విషయమై సమావేశంలో చర్చించారు. సమావేశమనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ..వీలైనంత త్వరలో షూటింగ్స్‌ ప్రారంభించేందుకు విధి విధానాలు తయారు చేయాలని సీఎం కేసీఆర్‌ తమకు నిర్దేశించారని  తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు త్వరలోనే షూటింగ్‌ లకు అనుమతిస్తామన్నారు. 

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఇబ్బంది లేదు కాబట్టి వాటికి అనుమతించామని మంత్రి తలసాని చెప్పారు. సినిమాలు, టీవీ షూటింగ్‌లకు సంబంధించి ఎలా అనుమతులివ్వాలనే విషయాలపై చర్చించాం. ప్రస్తుతం 70, 80 శాతం పూర్తయిన సినిమాలున్నాయి.  అవి చిన్న సినిమాలు కావొచ్చు. పెద్ద సినిమాలు కావొచ్చు. అదేవిధంగా టీవీ షూటింగ్‌లకు సంబంధించి పలువురు ప్రతినిధులు కొన్ని విషయాలు మా  దృష్టికి తీసుకువచ్చారు. టీవీ షూటింగ్‌లు తక్కువ మందితోనే ఉంటాయి. కాబట్టి వారికి అవకాశమివ్వాలన్నారని, ఈ విషయాలన్ని పరిశీలనలో ఉన్నాయని మంత్రి తలసాని తెలిపారు. థియేటర్ల రీఓపెన్ కు కొంత సమయం పట్టే అవకాశముందన్నారు.  ఈ సమావేశంలో దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివ, నటుడు అక్కినేని నాగార్జున, నిర్మాతలు డి సురేశ్ బాబు, సి కల్యాణ్‌తోపాటు పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo