బుధవారం 03 జూన్ 2020
Cinema - May 23, 2020 , 23:15:32

మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్‌ కన్నుమూత

మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్‌ కన్నుమూత

మిమిక్రీ ఆర్టిస్టుగా అంతర్జాతీయంగా పేరు పొందిన హరికిషన్‌ (57) శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హరికిషన్‌ 1963 మే 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. స్కూల్‌రోజుల్లోనే ఉపాధ్యాయులతో పాటు తోటి సహచరుల గళాల్ని అనుకరించేవారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో పాటు ఎందరో సినీ నటులు, రాజీకయ నాయకుల గొంతుల్ని అలవోకగా అనుకరించి మెప్పించేవారు.  కేవలం మనుషుల గొంతునే కాకుండా జంతువులు, పక్షుల శబ్దాల్ని కూడా అనుకరించేవారు. అంతర్జాతీయంగా కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆయన పలు పురస్కారాల్ని గెలుచుకున్నారు. నటుడు శివారెడ్డి ఈయన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. హరికిషన్‌ పలు చిత్రాల్లో చిన్న పాత్రల్ని పోషించారు. దాదాపు పదివేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఒక గంటలో 100 మంది గళాల్ని అనుకరించి ‘శతకంఠ ధ్వన్యనుకరణ ధురీణ’ బిరుదును పొందారు. శబ్దాలపరంగా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు. హరికిషన్‌ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


logo