గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 02, 2020 , 23:27:08

కేసీఆర్‌ ఆదేశాలతో కలిసి పనిచేస్తున్నాం!

కేసీఆర్‌ ఆదేశాలతో కలిసి పనిచేస్తున్నాం!

‘చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉంది. అందుకు పరిష్కారం వెతకాలి. వీటితో పాటు ఇండస్ట్రీ ఉన్నతి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆదేశాల మేరకు నేను, నాగార్జున, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కలిసి ప్రయత్నాలు చేస్తున్నాం’ అన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన ‘ఓ పిట్టకథ’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. విశ్వాంత్‌, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. చందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' టైమ్‌లో మా సెట్‌లో కార్‌వ్యాన్‌ ఉండేది కాదు. ఇప్పుడదొక విలాస వస్తువుగా మారిపోయింది. ఇందులో మార్పురావాలి. ప్రతి ఆర్టిస్టు షూటింగ్‌ టైమ్‌లో సెట్‌లోనే ఉండాలి. అవసరమైతే తప్ప కార్‌వ్యాన్‌ను వాడుకోవద్దు. హీరోహీరోయిన్లతో పాటు ఆర్టిస్టులందరూ సెట్‌లో ఉంటేనే బాధ్యతగా ఉంటుంది. 


సెట్‌లో ఉండి పనిచేస్తే సినిమా పనిరోజులు కూడా తగ్గిపోతాయి. మనకు జీవితాన్నిచ్చి.. అన్నం పెట్టిన  పరిశ్రమను  పరిరక్షించుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ అర్ధాకలితో ఉండాలని నేను చెబుతుంటా. అప్పుడే మరింత అంకితభావంతో పరిశ్రమలో ఎలా ఎదగాలో అని ఆలోచిస్తాం. కడుపునిండిన వ్యవహారంలా ఎవరూ ఉండకూడదు. ‘ఓ పిట్టకథ’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘కొత్త వాళ్లతో ఈ సినిమా చేశాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. తెలుగు చిత్రసీమలో సమస్యల పరిష్కారానికి చిరంజీవిగారు ఓ పెద్దదిక్కులా కృషి చేస్తున్నారు’ అని నిర్మాత వి.ఆనందప్రసాద్‌ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాం. ఇలాంటి సినిమాల్ని ఆదరిస్తే కొత్త కథలు మరిన్ని వచ్చే అవకాశం ఉంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్‌, బ్రహ్మాజీ, సందీప్‌కిషన్‌, ఆనంద్‌ దేవరకొండ, సత్యదేవ్‌, అనసూయ, సాగర్‌చంద్ర, వర్ష, ఉత్తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

logo