శుక్రవారం 10 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 23:21:07

ఎన్టీఆర్‌ అభిమానులు బెదిరిస్తున్నారు

ఎన్టీఆర్‌ అభిమానులు బెదిరిస్తున్నారు

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన ‘బంగారం’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మీరా చోప్రా.  ‘వాన’తో  పాటు మరికొన్ని తెలుగు  చిత్రాల్లో కనిపించిన  ఆమె ఎన్టీఆర్‌ అభిమానులు తనను వేధిస్తున్నారంటూ  సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు  విరామం లభించడంతో మంగళవారం మీరా చోప్రా ట్విట్టర్‌ ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.   ఈ సందర్భంగా ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు’ అని ఓ నెటిజన్‌ ఆమెను ప్రశ్నించారు.  ‘నాకు  ఎన్టీఆర్‌ తెలియదు.  నేను ఆయనకు అభిమానిని కాదు’ అంటూ మీరా చోప్రా సదరు వ్యక్తికి బదులిచ్చింది. మరో నెటిజన్‌ ‘శక్తి, దమ్ము సినిమాలు చూస్తే ఎన్టీఆర్‌కు మీరా చోప్రా అభిమానిగా మారిపోతుంది’ అని పేర్కొనగా  తనకు ఆ సినిమాలు చూసే ఆసక్తి లేదని బదులిచ్చింది. మీరా చోప్రా  సమాధానాలతో ఆగ్రహానికి లోనైన  ఎన్టీఆర్‌ అభిమానులు ఆమెను అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా బెదిరిస్తూ ట్వీట్లు పెట్టడం ప్రారంభించారు.   

వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మీరా చోప్రా  సైబర్‌ క్రైమ్‌ వారిని కోరింది. అభిమానులు దూషించిన స్క్రీన్‌షాట్స్‌ను   షేర్‌ చేసింది.  తనను చంపేస్తామని, యాసిడ్‌ దాడి చేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నది.  అంతేకాకుండా ఎన్టీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ ‘మీ కంటే మహేష్‌బాబును ఎక్కువగా అభిమానిస్తున్నానని చెప్పినందుకు తనను పోర్న్‌స్టార్‌గా పిలుస్తున్నారని, ఇలాంటి అభిమానులు ఉంటే మీరు విజయాల్ని అందుకోగలరని అనుకుంటున్నారా’ అంటూ మీరా చోప్రా పేర్కొన్నది.

మీరా చోప్రా ఫిర్యాదుపై సైబర్‌ క్రైం పోలీసులు కేసును నమోదు చేశారు.  మీరా చోప్రాను దూషిస్తూ పెట్టిన పోస్ట్‌లను షేర్‌ చేసినా, వాటిపై కామెంట్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్‌ క్రైం ఏసీసీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. మీరాచోప్రాకు జాతీయ మహిళా కమీషన్‌ మద్దతుగా నిలిచింది. ఈ బెదిరింపులపై రిపోర్ట్‌ పంపించాల్సిందిగా ఉమెన్‌ సెఫ్టీ వింగ్‌ డీఐజీని మహిళా కమీషన్‌ చైర్మన్‌ ఆదేశించారు.  గాయని చిన్మయితో పాటు పలువురు సినీ ప్రముఖులు మీరాచోప్రాకు అండగా నిలిచారు. 


logo