‘రిపబ్లిక్’ చిత్ర వేడుకలో పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని అన్నారు మంచు విష్ణు. ‘మా’ అధ్యక్షబరిలో ఉన్న ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పక్షమా? పవన్‌కల్యాణ్ పక్షమా? అన్నది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేస్తున్న మంచు విష్ణు మంగళవారం తన ప్యానల్‌తో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ “మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం వద్దని నేను ముందే చెప్పా. కానీ ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. ఎన్ని ఆర్గనైజేషన్స్, పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయో తేలాల్సిన అవసరం ఉంది. ప్రతి తెలుగు నటీనటుల ఆత్మ గౌరవం పోరాటమిది. ఇది నా కుటుంబం. మేమంతా ఒక్కటే అని నేను బలంగా నమ్ముతున్నా. అసోసియేషన్‌లో ఉన్న 900 మంది సభ్యుల సపోర్ట్ నాకు ఉంది. త్వరలో నా మ్యానిఫెస్టోను విడుదల చేస్తా. ఆ మ్యానిఫెస్టోను చూసిన తర్వాత చిరంజీవి, పవన్‌కల్యాణ్ నాకే ఓటేస్తారని నమ్ముతున్నా. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మా నాన్న మోహన్‌బాబును ఉద్ధేశించి పవన్‌కల్యాణ్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘మా’ ఎన్నికలు పూర్తయిన తర్వాత నాన్న పవన్‌కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం చెబుతారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తమ ప్రకటనల్లో పేర్కొన్నాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తమకు రెండు కళ్ల వంటివని వారు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, నటుడు, నిర్మాతగా ఛాంబర్ ప్రకటనకు నేను కట్టుబడి ఉన్నా. ఈ విషయంలో ప్రకాష్‌రాజ్ తెలుగు ఇండస్ట్రీ పక్షాన ఉన్నారా? పవన్‌కల్యాణ్ పక్కన ఉన్నారా? అన్నది స్పష్టం చేయాలి. నిర్మాతలే దేవుళ్లు. వారు లేకపోతే ఇండస్ట్రీనే లేదు. ప్రభుత్వాలతో మాట్లాడాల్సింది నిర్మాతలే. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఇప్పటికే ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. ఆన్లైన్ టికెటింగ్ విధానం తీసుకురావాలని నిర్మాతలే ప్రభుత్వాన్ని కోరారని మంత్రి పేర్ని నాని బహిరంగంగా చెప్పారు. అబద్ధాలు ఆడాల్సిన అవసరం మంత్రికి ఉండదు. సభ్యులకు బహుమతులు, పార్టీలు ఇస్తున్నామనేది అబద్ధం. నన్ను ఎవరూ పార్టీలకు పిలవలేదు. పార్టీలకు వెళ్లే అలవాటు నాకు లేదు’ అని చెప్పారు.