ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 01, 2020 , 22:21:13

భార్యాపిల్లల్ని మిస్సవుతున్నా

భార్యాపిల్లల్ని మిస్సవుతున్నా

కరోనా ప్రభావం వల్ల భార్యాపిల్లలు విదేశాల్లో ఉండిపోవడంతో వారికి దూరమవ్వడం ఆవేదనను కలిగిస్తున్నదని అన్నారు హీరో మంచు విష్ణు. తనలాగే ఎంతో మంది  ఇలాంటి బాధను అనుభవిస్తున్నారని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసిన విష్ణు ‘లాక్‌డౌన్‌  ఎన్నో రోజనేది కూడా మర్చిపోయా. చాలా ఇబ్బందిగా ఉంది. గడ్డం ఎందుకు పెంచుతున్నావని చాలా మంది అడుగుతున్నారు. కొంతమందికి గడ్డం నచ్చుతుంది. కొంత మందికి నచ్చడం లేదు. ఓ కారణం వల్ల గడ్డం పెంచుతున్నాను. విరోనికాతో పాటు పిల్లలను కలిసినప్పుడే గడ్డం తీసేస్తాను. వారందరూ విదేశాల్లో ఉన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో మా కుటుంబసభ్యులొకరి సర్జరీ కోసం అందరం వేరే దేశం వెళ్లాం. మార్చి 19న నాన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది విద్యానికేతన్‌ వార్షికోత్సవాన్ని జరుపుతుంటాం. ఆ వేడుక కోసం నేను ముందుగావచ్చాను. 

విరోనికాతో పాటు పిల్లలు నాలుగైదు రోజుల తర్వాత రావాల్సింది. విపత్కర పరిస్థితుల కారణంగా మన దేశంలోకి అంతర్జాతీయ విమానాల ప్రవేశాన్ని ఆపేశారు. ఏప్రిల్‌  14 తర్వాత విమాన సేవల్ని పునరుద్దరిస్తారని అనుకుంటున్నాను. అరియానా, వివియానా పుట్టిన తర్వాత  ఎప్పుడైన వేరే ఊరికి వెళితే  ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేవాణ్ణి. పిల్లలతో నాకు అటాచ్‌మెంట్‌ ఎక్కువ. ఈ సమయంలో అందరం ఒకే దగ్గర ఉంటే బాగుండేదనిపిస్తుంది.ఫోన్‌లో మాట్లాడుతున్నా మనసుకు కష్టంగా ఉంది. వారిని చాలా మిస్‌ అవుతున్నాను. నాలాగే ఈ బాధను చాలా మంది అనుభవిస్తున్నారు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. లాక్‌డౌన్‌ను విధిగా ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన అన్నారు. 


logo