శనివారం 30 మే 2020
Cinema - May 19, 2020 , 23:12:16

కష్టకాలంలో అందరూ తోడున్నారు

కష్టకాలంలో అందరూ తోడున్నారు

‘కష్టకాలంలో తల్లిదండ్రులు, అక్క లక్ష్మీతో పాటు  స్నేహితులు  నాకు తోడుగా నిలిచారు.  ఎవరూ నా చేయిని వదల్లేదు.  పడిపోతున్నా సమయంలో వంద చేతులు నాకు ఆసరాగా నిలిచాయి. జీవితంలో ఏం సాధించానని వెనక్కితిరిగి చూసుకుంటే మంచి కుటుంబం, స్నేహితుల్ని  పొందాననే సంతృప్తి దొరికింది’ అని అన్నారు మంచు మనోజ్‌. గత మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ‘అహంబ్రహ్మస్మి’తో పునరాగమనం చేయబోతున్నారు. నేడు మంచు మనోజ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో మనోజ్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి...

పుట్టినరోజు ప్రత్యేకతలేమిటి?

కరోనా ప్రభావంతో ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. వలసకూలీలు స్వగ్రామాలకు వెళ్లడానికి బస్సులను సమకూర్చుతున్నా. అందుకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్నా. దేశం నలుమూలలకు చెందిన  ఎంతో మంది వలస కూలీలు  కరోనా ప్రభావం వల్ల స్వగ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. వారందరిని ఇళ్లకు సురక్షితంగా పంపిస్తా

కరోనా విపత్తు నుంచి మీరు ఎలాంటి పాఠాన్ని నేర్చుకున్నారు?

పరిస్థితుల్ని ఎలా స్వీకరించాలనేది మన ధృక్కోణంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో పాజిటివ్స్‌ను వెతుక్కొని వాటికి అనుగుణంగా జీవితాన్ని గడుపుతున్నా. నెగెటివ్‌గా ఆలోచిస్తే  బతకలేము. ‘జీవితం ఇంతే అనుకుంటే నరకం. జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం’ అని నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సిద్ధాంతాన్ని నేను విశ్వసిస్తాను.  సహాయకార్యక్రమాలు, వర్కవుట్స్‌.. గ్యాప్‌లో చాలా పనులు చేస్తున్నా.   

సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం ఎంతవరకు ఉంటుందని అనుకుంటున్నారు?

థియేటర్లు కొందరి  కంట్రోల్‌లో  ఉండటం వల్ల చిన్న సినిమాల నిర్మాతలు కష్టాల్ని అనుభవించారు.   అలాంటివారందరికి ఓటీటీలు చక్కటి ప్రత్యామ్నాయంగా మారిపోయాయి. భవిష్యత్తుల్లో కొత్త నిబంధనలతో  తప్పకుండా థియేటర్లు ప్రారంభమవుతాయి. అప్పటివరకు పెద్ద సినిమాలు వేచిచూడక తప్పదు.  

మూడేళ్ల విరామం తర్వాత ‘అహంబ్రహ్మస్మి’ చిత్రంలో నటిస్తున్నారు? పునరాగమనానికి ఆ కథను ఎంచుకోవడానికి కారణమేమిటి?

ఒక మనిషిలో భిన్న కాలాల్లో కలిగిన భావాలకు దృశ్యరూపంగా ఈ సినిమా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇదివరకు తెలుగు తెరపై రాని యాక్షన్‌ అంశాల కలబోతగా  దర్శకుడు శ్రీకాంత్‌రెడ్డి తెరకెక్కించబోతున్నారు. సినిమాలకు విరామం తీసుకోవాలనే ఆలోచన నాదే. మళ్లీ  నా ప్రొడక్షన్‌ హౌస్‌ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఆలోచనతో సొంత బ్యానర్‌ను స్థాపించాను.

భవిష్యత్తు ప్రణాలికళ్ని ఎలా సిద్ధం చేసుకుంటున్నారు?

మనం ఒకటి ప్లాన్‌ చేస్తే దేవుడు మరొకటి ప్లాన్‌ చేస్తాడు. అందుకే తొందరపాటు లేకుండా ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణాన్ని సాగించాలనుకుంటున్నా.  భవిష్యత్తు గురించి  ఎక్కువగా  ఆలోచించడం లేదు. ఇకపై కొత్త మనోజ్‌ను చూస్తారు. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ  సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.

చిత్రసీమలోని హీరోలతో మీకు మంచి స్నేహం ఉంది కదా?

ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో  దేవుడిచ్చిన బహుమతిగానే చెప్పాలి. సినిమాల విడుదల విషయంలో అన్నదమ్ముల్లా ఒకరికొకరు  సహాయసహకారాలు అందించుకుంటాం. పోటీ అనే ఆలోచనలు లేకుండా కుటుంబంలా కలిసిపోయి పనిచేస్తున్నాం.


logo