బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 00:21:43

రజనీ కోసం షూటింగ్‌ వాయిదా!

రజనీ కోసం షూటింగ్‌ వాయిదా!

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. నయనతార, కీర్తిసురేష్‌, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.  గత ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమాను ప్రారంభించి డబ్భుశైతం వరకు చిత్రీకరణ పూర్తిచేశారు. అనంతరం కరోనా ప్రభావంతో షూటింగ్‌ వాయిదా పడింది.  ప్రస్తుతం షూటింగ్స్‌ అన్నీ మొదలైన నేపథ్యంలో ఈ నెల 23 నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణను పునఃప్రారంభించేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారీ వ్యయంతో సెట్‌ను కూడా నిర్మించారు. 40రోజుల  షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉండటంతో సినిమాను పూర్తిచేసి డిసెంబర్‌ నెలాఖరులో విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసినట్లు తెలిసింది. వయసురీత్యా రజనీకాంత్‌ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్రీకరణను ఆపివేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్‌ వయసు 69 సంవత్సరాలు. సెట్‌లో దాదాపు 100 మందికిపైగా బృందంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఉండటంతో ఆరోగ్యపరంగా రజనీకాంత్‌ రిస్క్‌ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించడంతో షూటింగ్‌ను ఆపేశారని సమాచారం. గ్రామీణ నేపథ్య ఇతివృత్తంతో కుటుంబ అనుబంధాలు ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ గ్రామపెద్దగా కనిపిస్తారని తెలిసింది. ఆయన భార్యగా నయనతార నటిస్తోంది. మీనా, ఖుష్భూ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.logo