గురువారం 04 మార్చి 2021
Cinema - Nov 28, 2020 , 00:09:47

మేజర్‌ ప్రయాణం

మేజర్‌ ప్రయాణం

26/11 ముంబయి ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత ఆధారంగా రూపొదుతున్న చిత్రం ‘మేజర్‌'. అడివి శేష్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు.   శశికిరణ్‌ తిక్కా దర్శకుడు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.  శోభితా దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్‌ కీలక పాత్రధారులు. ‘మేజర్‌' లుక్‌ టెస్ట్‌ వీడియోను శుక్రవారం హీరో మహేష్‌బాబు విడుదలచేశారు.  ఈ వీడియోలో లుక్‌ టెస్ట్‌ కోసం సాగించిన ప్రయాణాన్ని అడివి శేష్‌ వివరిస్తూ  ‘చేయాలనుకున్న పని మీద ఉన్న నమ్మకం, ఆ పని చేసేటప్పుడు మనలోని నిజాయితీ ఇవి రెండు మేజర్‌ సందీప్‌ లక్షణాలు. వాటిని నమ్ముకొని లుక్‌ టెస్ట్‌కు వెళ్లి ఫొటో దిగాను.  26/11  దాడుల్లో  మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ మరణించిన సమయంలో  టీవీల్లో వచ్చిన ఆయన ఫొటో చూశాను. ఆ కళ్లలో నాకు తపన కనిపించింది. ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నుంచి ఈ సినిమా మొదలైంది.  సందీప్‌ తల్లిదండ్రులను కలిసి అతడికి సంబంధించిన చాలా విషయాల్ని తెలుసుకున్నా. ఓ సందర్భంలో నిన్ను చూస్తుంటే సందీప్‌ గుర్తొస్తున్నాడని  అతడి తల్లిదండ్రులు నాతో చెప్పారు.  ఆ క్షణమే సందీప్‌ కథతో సినిమా చేయడానికి  అంగీకారం దొరికిందని అర్థమైంది.  మహేష్‌బాబు, అనురాగ్‌శరత్‌, సోనీ పిక్చర్స్‌ సహకారంతో తెలుగు, హిందీ భాషల్లో పాన్‌ ఇండియన్‌ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నారు.

VIDEOS

logo