ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 01:30:00

భవిష్యత్తు తరాల రక్షణ ప్లాన్‌

భవిష్యత్తు తరాల రక్షణ ప్లాన్‌

  • గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌
  • భూమిపై మనుషులతో పాటు మొక్కలకు జీవించే హక్కు 
  • గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్వీకరించాలని అభిమానులకు.. హీరో మహేష్‌బాబు పిలుపు

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ అద్భుతమైన కార్యక్రమమని  అగ్రహీరో మహేష్‌బాబు కొనియాడారు. గ్రీన్‌ చాలెంజ్‌ అనే కంటే భవిష్యత్తు తరాల మనుగడకు రక్షణ ప్లాన్‌ అంటే బాగుంటుందన్నది తన అభిప్రాయమన్నారు. ఆదివారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌'లో పాల్గొన్నారాయన. ఫిలింనగర్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులతో పాటు మొక్కలకు, జంతువులకు కూడా ఉందన్నారు. సకల జీవరాశుల్ని సమానంగా చూడటమే నాగరికతకు చిహ్నమని చెప్పారు. మనమంతా బంగళాలు కడుతూ, అడవుల్ని నరికి భూమిని నిస్సారం చేస్తూ దానినే  నాగరికత, అభివృద్ధి అనుకొని అపోహ పడుతున్నామని గుర్తుచేశారు.  ఆ కారణంగానే ఎన్నో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. తన దృష్టిలో నిజమైన అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా  అని తెలిపారు. కరోనా లాంటి మహమ్మారులు లేకుండా నిశ్చింతంగా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని మహేష్‌బాబు హితవు పలికారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌' లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ద్వారా ముగ్గురు కాకుండా ముప్పై మందిని కదిలించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. స్వార్థంతో నిండిపోయిన సమాజంలో ఇంత ఉదాత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని ఎంతోమందిని కదిలించడం మామూలు విషయం కాదన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ అభినందనీయుడని అన్నారు. ఆయన కృషికి మద్ధ్దతుగా అభిమానులు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హీరో జూనియర్‌ఎన్టీఆర్‌, తమిళనటుడు విజయ్‌, నటి శృతిహాసన్‌లకు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను విసిరారు మహేష్‌బాబు.

‘సర్కారు వారి పాట’ మోషన్‌పోస్టర్‌

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ పతాకాలపై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట  నిర్మిస్తున్నారు. పరశురామ్‌ దర్శకుడు.  ఆదివారం మహేష్‌బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం మోషన్‌ పోస్టర్‌ను విడుదలచేసింది. రూపాయి కాయిన్‌ టాస్‌ వేస్తూ ఇందులో మహేష్‌ కనిపించారు.  ఈ మోషన్‌ పోస్టర్‌లో థమన్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నది. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ‘బలమైన సందేశంతో తెరకెక్కుతున్న పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌ ఇది. అభిమానులు ఆశించే అన్ని హంగులు ఉంటాయి’ అని తెలిపారు. ‘మహేష్‌బాబు చిత్రానికి దర్శకత్వం వహించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరబోతున్నది. ఆయన పుట్టినరోజున మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు పరశురామ్‌ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మది, ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌, ఆర్ట్‌: ఏ.ఎస్‌. ప్రకాష్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌. logo