e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 29, 2021
Home News Maha Samudram సినిమా రివ్యూ

Maha Samudram సినిమా రివ్యూ

తారాగణం: శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితీరావు, అనూఇమ్మాన్యుయెల్‌, రావు రమేష్‌, శరణ్య తదితరులు
సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
రచన-దర్శకత్వం: అజయ్‌ భూపతి

మల్టీస్టారర్‌ చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందునా శర్వానంద్‌, సిద్ధార్థ్‌ వంటి యువహీరోల కలిస్తే ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని ఆశిస్తారు. కెరీర్‌ ఆరంభం నుంచి ఈ యువహీరోలిద్దరూ కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి పెద్దపీట వేస్తుంటారు. ఆ కారణంగానే ‘మహాసముద్రం’ చిత్రానికి నిర్మాణం నుంచే మంచిహైప్‌ క్రియేట్‌ అయింది. ‘ఆర్‌.ఎక్స్‌.100’ వంటి యూత్‌ఫుల్‌ ఎమోషన్‌ లవ్‌స్టోరీతో తొలి చిత్రంతోనే ప్రతిభను చాటుకున్నారు యువ దర్శకుడు అజయ్‌భూపతి. ఆయన ద్వితీయ ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఉత్సుకతతో ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులముందుకొచ్చిన ‘మహాసముద్రం’ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథ గురించి..

- Advertisement -

అర్జున్‌ (శర్వానంద్‌), విజయ్‌ ( సిద్ధార్థ్‌) ఇద్దరు ప్రాణస్నేహితులు. విశాఖ నగరంలో ఎన్నో కలలతో జీవితాన్ని సాగిస్తుంటారు. ఎస్‌.ఐ.కావాలన్నది విజయ్‌ లక్ష్యం. అధికారం, డబ్బు ఉంటే జీవితంలో ఏమైనా చేయొచ్చని నమ్ముతుంటాడు. అతని ప్రేయసి మహా (అదితిరావు). మరోవైపు సాగరతీరంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటాడు ధనుంజయ్‌ (కేజీఎఫ్‌ రామ్‌). నగర నేర సామ్రాజ్యానికి అధిపతిగా చలామణి అవుతుంటాడు. అనుకోని సంఘటన వల్ల ధనుంజయ్‌ పై హత్యాయత్నం చేస్తాడు విజయ్‌. ఆ భయంతో నగరాన్ని వదిలి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ల జీవితంలో చెంచు మామ (జగపతిబాబు) పోషించిన పాత్ర ఏమిటి? తన స్నేహితుడు విజయ్‌ను కాపాడుకోవడానికి అర్జున్‌ చేసిన ప్రయత్నాలేమిటి? ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? ఇద్దరు స్నేహితులు తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందంటే..

ఇద్దరి స్నేహితు జీవితాల నేపథ్యంలో అనేక పొరల్లో సంక్లిష్టంగా అల్లుకున్న కథ ఇది. స్నేహితుల మధ్య ప్రేమ, సంఘర్షణ, అపనమ్మకం, శత్రుత్వం అంశాలతో భావోద్వేగభరితంగా కథను రాసుకున్నారు. మధ్యతరగతి యువకుల జీవితానికి మాఫియా నేపథ్యాన్ని ముడిపెట్టి..అదే సమయంలో ఓ సంఘర్షణాత్మక ప్రేమకథను చెబుతూ…స్నేహంలోని గాఢతను ఆవిష్కరిస్తూ భిన్న ఎమోషన్స్‌తో కథాగమనాన్ని నడిపించారు. సిద్దార్థ్‌-అదితిరావు, శర్వానంద్‌-అనుఇమ్మాన్యుయెల్‌ ప్రేమకథలతో మొదలై తొలిభాగం అనేక మలుపులతో కనిపిస్తుంది. చెంచు మామతో ఇద్దరు మిత్రులకు ఉన్న అనుబంధం, ధనుంజయ్‌ తమ్ముడు గూని బాబ్జీ (రావురమేష్‌) ఎపిసోడ్‌తో తొలిభాగమంతా కథను, అందులోని పాత్రల్ని పరిచయం చేస్తూ సాగింది.

మహా సముద్రం దర్శకుడు అజయ్‌ భూపతితో ప్రత్యేక ఇంటర్వూ

ద్వితీయార్థం అర్జున్‌ జీవితం తాలూకు సంఘర్షణ ప్రధానంగా సాగింది. విజయ్‌ ప్రేయసి మహా బాధ్యతలు తీసుకున్న అర్జున్‌ మాఫియా డాన్‌గా ఎదగడం, కొత్త డాన్‌గా అవతరించిన గూని బాబ్జీని సవాలు చేయడం వంటి అంశాలతో సెకండాఫ్‌ ఊపందుకుంటుంది. అయితే విజయ్‌ తన ప్రేయసిని ద్వేషిస్తూ వదిలివెళ్లిపోవడానికి సరైన కారణాలు ఏమిటో కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు. అడిగినప్పుడల్లా డబ్బులిచ్చి ఎంతో అప్యాయంగా ఉండే ప్రేయసి పట్ల విజయ్‌ అకారణ ద్వేషమేమిటో అర్థం కాదు. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చిన విజయ్‌..అర్జున్‌ పట్ల పగను పెంచుకోవడం.. అతన్ని అంతం చేయాలనుకోవడం కూడా సబబుగా అనిపించదు.

అయితే విజయ్‌ తిరిగొచ్చిన తర్వాత పతాకఘట్టాలు ఉద్వేగంగా సాగాయి. అర్జున్‌ అనతికాలంలోనే మాఫియా డాన్‌గా ఎదగడం..విశాఖను శాసించడం పూర్తి సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అందుకు దారితీసిన పరిస్థితుల్ని బలంగా చూపించలేకపోయారు. ధనుంజయ్‌, గూని బాబ్జీ వంటి కరడుగట్టిన మాఫియా డాన్‌లు విజయ్‌, అర్జున్‌ వంటి సామాన్య యువకుల చేతికి చిక్కి అంత సులభంగా అంతమైపోవడం లాజిక్‌కు అందదు. అదే సమయంలో ప్రాణస్నేహితుల మధ్య వచ్చిన అపార్థాలు, మనస్పర్థలకు కూడా పెద్దగా కారణాలు కనిపించవు. గూని బాబ్జీ మీద కోపంతో తన స్నేహితులు అర్జున్‌ను విజయ్‌ ద్వేషించడం ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించలేదు.

ఎవరేలా చేశారంటే..

అనుక్షణం సంఘర్షణకు లోనయ్యే స్నేహితుడిగా శర్వానంద్‌ తన పాత్రలో జీవించాడు. ఈ తరహా పాత్రల్లో మెప్పించడం ఆయనకు కొత్తేమి కాదు. సిద్థార్థ్‌ పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌తో సాగింది. ఆయన కెరీర్‌లో ఇదొక కొత్త పాత్రగా చెప్పవొచ్చు. అదితిరావు అభినయం బాగుంది. కళ్లలో ప్రేమను, ఉద్వేగాల్ని పలికించిన తీరు ఆకట్టుకుంటుంది. అనుఇమ్యాన్యుయెల్‌ పాత్ర కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. చుంచు మామగా జగపతిబాబు, గూని బాబ్జీగా రావు రమేష్‌ తమదైన శైలిలో పాత్రల్ని రక్తికట్టించారు. మిగతా పాత్రధారులందరూ పరిధులమేరకు నటించారు.

సాంకేతికంగా అన్ని అంశాలు బాగా కుదిరాయి. రాజ్‌తోట సినిమాటోగ్రఫీ విశాఖ సాగర అందాల్ని బాగా చూపించింది. పాటల్లో విజువల్స్‌ని చక్కగా ప్రజెంట్‌ చేసింది. సంభాషణలు బాగున్నాయి. భుజాల మీద బరువుని ఎవరైనా మోయగలరు కానీ గుండెలోని బంధాల బరువు మోసినవాడే నిజమైన స్నేహితుడు వంటి డైలాగ్స్‌ మెప్పిస్తాయి. పాటలు మెలోడీ ప్రధానంగా ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సన్నివేశాల్లోని ఫీల్‌ను ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపించాయి. దర్శకుడు అజయ్‌భూపతి మానవోద్వేగాల నేపథ్యంలో ఓ సంక్లిష్టమైన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. స్నేహం, ప్రేమ లోతుల్ని తనదైన భావాలతో తెరపై ఆవిష్కరించారు.

తీర్పు..

అక్కడక్కడా కథాగమనంలో కొన్ని లోపాలున్నా చక్కటి భావోద్వేగాలతో కూడిన కథగా ‘మహాసముద్రం’ ఆకట్టుకుంటుంది. కథా, స్క్రీన్‌ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ‘మహాసముద్రం’ మరింతగా ఆకట్టుకునే సినిమాగా మిలిగిపోయేది. బాక్సాఫీస్‌ బరిలో ఈ సినిమా ఫలితమేమిటో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే..

రేటింగ్‌: 2.75/5

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement