సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కరుణకుమార్ దర్శకుడు. ఈ చిత్రంలోని ‘మందులోడా ఓరిమాయలోడా’ అనే లిరికల్ వీడియోను అగ్రహీరో చిరంజీవి శుక్రవారం విడుదలచేశారు. కాసర్లశ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని సాహితి చాగంటి, ధనుంజయ్ ఆలపించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మాస్ ప్రేక్షకుల్ని అలరించే గీతమిది. ఉత్తరాంధ్ర జానపదాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ కాసర్లశ్యామ్ అద్భుతంగా ఈ పాటను రాశారు. యూట్యూబ్‌లో ఈ పాటకు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపారు. ‘సూరిబాబు లైటింగే మాస్ అంటే ఆడు డ్యాన్సింగ్ చేస్తే అదోరకం మాస్’ అంటూ ఈ పాటను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా సుధీర్‌బాబు వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యాందత్ సైనుద్దీన్, ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్.