తెలంగాణ యాస, భాషల పరిమళాల్ని గుబాళిస్తూ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్ ఆసాంతం హృదయాల్ని స్పృశించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె.నారాయణ్‌దాస్ నారంగ్, పి.రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 24న థియేటర్లలో విడుదలకానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల శైలి సున్నితమైన భావోద్వేగాలు, మనసుకు హత్తుకునే సంభాషణలతో ట్రైలర్ ఆకట్టుకుంది. లోన్ తీసుకొని ఏదైనా వ్యాపారం చేయాలని తపించే రేవంత్, బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న మౌనిక మధ్య నడిచే ప్రేమకథ, వారి జీవితంలో ఎదురయ్యే సంఘర్షణకు దృశ్యరూపంలా ట్రైలర్ మెప్పించింది. అవరోధాల్ని అధిగమించి తమ ప్రణయబంధాన్ని సాఫల్యం చేసుకునేందుకు రేవంత్, మౌనిక ఎలాంటి పోరాటం చేశారన్నదే సినిమా ఇతివృత్తమని అర్థమవుతున్నది. మధ్యతరగతి యువకుడిగా రేవంత్, ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతిగా మౌనిక పాత్ర చిత్రణ అందరిని ఆకట్టుకునేలా అనిపించాయి. ‘మనకు లోన్లు ఇవ్వరు..రెంటుకు రూములు ఇవ్వరు..పిల్లనిస్తార్రా’..‘మనం బిజినెస్‌లు చేయలేం..మనతోని కాదని..మాటలు అంటున్నరే’…‘డ్యాన్స్ ఏం జేసినవ్..వానల నెమలిలెక్క..’ ‘ఏందబ్బా నువ్వు జమానా మాటలు జెప్తున్నవ్..’.. ‘బతుకు కోసం ఈ ఉరుకులాడటం మాత్రం నాతోని కాదింక..చస్తే చద్దాం..తేల్చుకొని చద్దాం..’ అనే సంభాషణలు ఆకట్టుకున్నాయి. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని, ఉత్తేజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్, సంగీతం: పవన్ సి.హెచ్, సహనిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల.