మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 21:42:22

రోజారమణి-చక్రపాణి దంపతులకు జీవితసాఫల్య పురస్కారం

రోజారమణి-చక్రపాణి దంపతులకు జీవితసాఫల్య పురస్కారం

లండన్‌: అలనాటి నటీనటులు రోజారమణి-చక్రపాణిని ఆదర్శ దంపతుల జీవితసాఫల్య పురస్కారం-2020 వరించింది. అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్‌ ఇండియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్‌ 17న సాయంత్రం వారికి పురస్కారాన్ని ఆన్‌లైన్‌లో ప్రధానం చేశారు. వారి స్వగృహంలో పురస్కార గ్రహీతలను కొడుకు హీరో తరుణ్‌, కూతురు అమూల్య శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా తరుణ్‌ మాట్లాడుతూ, బాల్యంలో తన తల్లి భక్తప్రహ్లాద సినిమాలో నటించి జాతీయ పురస్కారం అందుకోవడం.. తానుకూడా బాలనటుడిగా అంజలి చిత్రంలో నటించి నేషనల్‌ అవార్డు పొందడం ఒక మధుర స్మృతి అని పేర్కొన్నారు. 

వంశీ సంస్థల వ్యవస్థాపకుడు శిరోమణి వంశీరామరాజు స్వాగతం పలికిన ఈ సభలో యూకే తెలుగు సమాఖ్య ట్రస్టీ డాక్టర్‌ వీపీ కిల్లి పరిచయ వ్యాఖ్యానం చేశారు. సభలో పాల్గొన్న మాజీ ఎంపీ, సినీ నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్‌ మాట్లాడారు. రోజారమణి తనతో ‘వస్తాడే మా బావ’, ‘భారతంలో ఒక అమ్మాయి’ చిత్రంలో నటించారని గుర్తుచేశారు. ఆమె నటనను కొనియాడారు. ఆమెను డబ్బింగ్‌ కళాకారిణిగా తానే పరిచయం చేశానని చెప్పారు. 400 చిత్రాలకుపైగా డబ్బింగ్‌ చెప్పారని తెలిపారు. అలాగే, చక్రపాణి ఒరియాలో ఎన్టీర్‌లాగా పౌరాణిక పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. రోజారమణిచక్రపాణి మాట్లాడుతూ, తమ జీవితమంతా కళకే అంకితం చేశామని, కళలమయమైన జీవితం ఆనందాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. చివరిగా జరిగిన సంగీత కార్యక్రమంలో రాధికానోరి(అమెరికా), రాజేంద్రప్రసాద్‌(వైజాగ్‌) పాటలతో అలరించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్‌ తెన్నేటి సుధా, శైలజ సుంకరపల్లి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర, జయశ్రీ పీసాపాటి(హాంకాంగ్‌), విజయ గొల్లపూడి (ఆస్ట్రేలియా) ప్రసంగించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo