శనివారం 04 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 00:04:58

హోమ్‌ డెలివరీకి సిద్ధం

హోమ్‌ డెలివరీకి సిద్ధం

ఓటీటీ వేదికలు చిన్న సినిమాలకు మాత్రమే పరిమితమని, పెద్ద సినిమాల్ని ఓటీటీ ద్వారా విడుదల చేయడం లాభసాటి కాదనేది చాలా మంది దర్శకనిర్మాతల వాదన. స్టార్‌ హీరోల చిత్రాల్ని థియేటర్లలోనే విడుదల చేయడమే శ్రేయస్కరమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా ప్రభావం నానాటికీ ఉధృతమవుతుండటంతో థియేటర్లు ఎప్పుడూ ప్రారంభమవుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవ్‌గణ్‌ వంటి అగ్రకథానాయకులు సైతం ఓటీటీ బాట పట్టారు. వారు నటించిన చిత్రాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా విడుదల కాబోతున్నాయి. దీంతో కరోనా టైమ్స్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌దే హవా అని అంతటా వినిపిస్తోంది.

కరోనా ప్రభావానికి ముందు నేరుగా సినిమాల్ని ఓటీటీలో విడుదల చేసే ట్రెండ్‌ లేదు.  మార్చి నెలలో థియేటర్‌లు మూతపడటంతో ఓటీటీ ప్రత్యామ్నాయ వేదికగా మారింది. సినిమాల విడుదల కోసం దర్శకనిర్మాతలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించడం మొదలుపెట్టారు.  అమితాబ్‌బచ్చన్‌, ఆయుష్మాన్‌ఖురానా నటించిన ‘గులాబోసితాబో’,  కీర్తిసురేష్‌ ‘పెంగ్విన్‌', జ్యోతిక ‘పొన్‌మగల్‌వంధాన్‌' ‘కృష్ణ అండ్‌హిజ్‌ లీల’ లాంటి కాన్సెప్ట్‌ ఓరియెంటెండ్‌ సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాలన్నీ పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కాయి. థియేటర్‌లు ప్రారంభమయ్యే వరకు ఎదురుచూస్తే నష్టపోతామనే  అభిప్రాయంతో నిర్మాతలు ఓటీటీ ద్వారా విడుదలచేశారు. అవన్నీ వారికి లాభాల్ని తెచ్చిపెట్టడంతో చాలా మంది చిన్న సినిమాల నిర్మాతలు ఓటీటీ వైపు దృష్టిసారించారు. ఈ క్రమంలో ఓటీటీ ద్వారా పెద్ద సినిమాలు విడుదలకానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సదరు చిత్ర నిర్మాతలు  ఆ వార్తల్ని కొట్టిపడేస్తూ వచ్చారు. 

అగ్రహీరోల చిత్రాలు ఓటీటీ బాట

కరోనా వ్యాప్తి దృష్ట్యా  జూలై 31వరకు థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వాలు అనుమతులు నిరాకరించాయి. దాంతో అగ్ర హీరోలు చిత్రాలు హోమ్‌ డెలివరీకి సిద్ధమయ్యాయి. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘లక్ష్మీబాంబ్‌' అజయ్‌దేవ్‌గణ్‌ ‘భుజ్‌ ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’తో పాటు మరో ఐదు బాలీవుడ్‌ చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదలకానున్నాయి. అక్షయ్‌కుమార్‌ హీరోగా  లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీబాంబ్‌' చిత్ర డిజిటల్‌ హక్కుల్ని 125 కోట్లు వెచ్చించి డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ కొనుగోలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో పెద్ద విజయాన్ని  సాధించిన ‘కాంచన’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.  గత కొన్నేళ్లుగా అక్షయ్‌కుమార్‌ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద వందకోట్ల మైలురాయిని దాటుతున్న తరుణంలో ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదలచేస్తే నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చిత్రబృందం అనూహ్యంగా ఓటీటీలో విడుదలచేస్తున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  1970 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధంలో ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన ఐఏఎఫ్‌ స్కాడ్రన్‌ లీడర్‌ విజయ్‌ కర్నిక్‌  జీవితం ఆధారంగా అజయ్‌దేవగణ్‌, సంజయ్‌దత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘భుజ్‌ ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల్ని అలరించబోతున్నది.  తొలుత ఈ సినిమాను ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హాట్‌స్టార్‌ ద్వారా విడుదలచేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయినట్లు సమాచారం. అలాగే సంజయ్‌దత్‌, అలియాభట్‌, ఆదిత్యరాయ్‌కపూర్‌ ప్రధాన పాత్రల్లో మహేష్‌భట్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘సడక్‌-2’, అభిషేక్‌బచ్చన్‌ కథానాయకుడిగా స్టాక్‌బ్రోకర్‌ హర్షద్‌ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ది బిగ్‌బుల్‌' ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకురానున్నాయి. వీటితో పాటు విద్యుత్‌ జమ్వాల్‌   ‘ఖుదా హఫీజ్‌', కునాల్‌ ఖేము ‘లూట్‌కేస్‌'  హాట్‌స్టార్‌లో  విడుదలకానున్నాయి. సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’ సైతం ఓటీటీ ద్వారా జూలైలో విడుదలకానుంది. 

బాలీవుడ్‌ మాదిరిగానే వేసవిలో వాయిదాపడిన తెలుగు చిత్రాలు ఓటీటీ బాటను అనుసరిస్తాయా అనే ప్రశ్న అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కరోనా ప్రభావంతో వీ, ఒరేయ్‌ బుజ్జిగా,  నిశ్శబ్దంతో పాటు పలు తెలుగు సినిమాల రిలీజ్‌లు వాయిదాపడ్డాయి. నిర్మాతలు మాత్రం ఈ సినిమాల్ని థియేటర్‌లలోనే విడుదల చేస్తామంటూ ప్రకటించారు.  అయితే సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో తమ నిర్ణయాలపై పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైన ‘పెంగ్విన్‌', ‘కృష్ణ అండ్‌ హిజ్‌లీల’ చిత్రాలకు చక్కటి ఆదరణ లభించింది.  దాంతో పలువురు నిర్మాతలు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. 

వ్యతిరేకిస్తున్న మల్టీప్లెక్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ వర్గాలు

బాలీవుడ్‌లో ఒకేసారి ఏడు చిత్రాల్ని ఓటీటీలో  విడుదలచేయనున్నట్లు ప్రకటించడంతో ఎగ్జిబిటర్లు, మల్టీప్లెక్స్‌ వర్గాలు  అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలపై ఆశలు పెట్టుకొని థియేటర్ల ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నామని..ఇలాంటి తరుణంలో నేరుగా ఓటీటీ వేదికల్ని ఎంచుకోవడం నిరుత్సాహపరిచిందని కార్నివల్‌ సినిమాస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. అయితే అక్షయ్‌కుమార్‌ మరో చిత్రం ‘సూర్యవన్షి’, రణ్‌వీర్‌సింగ్‌ ‘83’ చిత్రాల్ని మాత్రం నేరుగా థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించడంతో ఎగ్జిబిటర్స్‌కు కాస్త ఊరటనిచ్చింది.


logo